iDreamPost
iDreamPost
తెరమీద ఎప్పటికీ ఫేడ్ అవుట్ కానీ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమ మాత్రమే. ఇప్పటిదాకా కొన్ని వందల వేల సినిమాలు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రతి తరానికి ఫ్రెష్ గా చెప్పాలనే దర్శకుల ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. కాకపోతే రొటీన్ గా కాకుండా విభిన్న కోణాల్లో లవ్ స్టోరీస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆదరణ దక్కుతుంది. అలాంటి ఉదాహరణే 1992లో వచ్చిన చామంతి. దర్శకుడిగా ఆర్కె సెల్వమణి అప్పటికి యాక్షన్ దర్శకుడిగా చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. విజయ్ కాంత్ తో తీసిన పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్ కనక వర్షం కురిపించి ఆయన్ను స్టార్ డైరెక్టర్ గా మార్చేశాయి.
అదే కోవలో కాకుండా ఒక స్వచ్ఛమైన ప్రేమకథ చెప్పాలని చెంబరుతి పేరుతో తమిళ్ లో రోజాని హీరోయిన్ గా పరిచయం చేస్తూ మూవీ మొదలుపెట్టారు. సముద్రంలో చేపలు పట్టుకునే బెస్తవాడి చెల్లెలికి బాగా డబ్బున్న పెద్దింటి అబ్బాయికి మధ్య ప్రేమను చాలా హృద్యంగా చూపించారు. ప్రశాంత్ కు చామంతి చాలా పేరు తీసుకొచ్చింది. అతనికి బామ్మగా సీనియర్ నటి భానుమతి గారు చేయడంతో ఆ పాత్రకు హుందాతనం వచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. రోజా అన్నయ్యగా చేసిన రాధారవి దీని దెబ్బకు చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అప్పటికే క్రూరమైన విలన్ గా పేరు తెచ్చుకున్న మన్సూర్ అలీ ఖాన్ కు సెల్వమణి దీని రూపంలో మరో పెద్ద బ్రేక్ ఇచ్చారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. ఇదే రాజయోగం, నీ కథ నీదిలే నా కథ నాదిలే, చామంతి పువ్వే, చక్కని చుక్కని చిలక జతకొచ్చేను కాదా పాటలు ఊరు వాడా మ్రోగిపోయాయి. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అయినప్పటికీ చామంతి ఇక్కడా ఘన విజయం సొంతం చేసుకుంది. కొన్ని సీన్లు మాత్రం రీ షూట్ చేశారు. నిర్మాత కోవై తంబీ సబ్జెక్టుని నమ్మి భారీగా ఖర్చు పెట్టారు. క్లైమాక్స్ ని చిత్రీకరించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. చామంతితో పరిచయమైన రోజా తర్వాతి కాలంలో సెల్వమణిని వివాహం చేసుకున్స్ సంగతి తెలిసిందే. రోజాకు చామంతి డెబ్యూ గానే కాకుండా స్టార్ హీరోయిన్ గా మారడానికి మొదటి మెట్టుగా నిలిచింది. తర్వాత ఎన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నా కెరీర్ పరంగా వ్యక్తిగత జీవిత పరంగా చామంతి సినిమా రోజాకు ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోయింది.