iDreamPost
iDreamPost
కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అండదండలు అందిస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి సర్వవిధాలా చేదోడుగా ఉంటామని అంతా ప్రకటించారు. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ సమైక్యంగా ఎదుర్కొందామని ప్రధాని ఇచ్చిన పిలుపునకు కట్టుబడతామని దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం కలిసి సాగుదామని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం దానికి తగ్గట్టుగా స్పందించడం లేదు. కేవలం మాటలు తప్ప ఆయా రాష్ట్రాలను ఆదుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపించడం లేదు. నిధుల కేటాయింపులో ఉదారంగా వ్యవహరించాల్సిన వేళ దానికి తగ్గట్టుగా మోడీ ప్రభుత్వ తీరు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ అనుభవం చూస్తే ఇప్పటికే కేంద్రం నుంచి వస్తున్న పన్నుల వాటా బాగా తగ్గింది. 2017-18 తో పోలిస్తే 2018-19లో పెరిగింది. కానీ 2019-20లో మాత్రం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు గానీ పన్నుల వాటా గానీ బాగా పడిపోయింది. సుమారుగా 6వేల కోట్లు తక్కువగా కేవలం 46వేల కోట్లను మాత్రమే గత ఏడాది కేంద్రం విడుదల చేసింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వేస్తున్న కోతలు మరింత భారం అవుతున్నాయి. అయినప్పటికీ విపత్తు వేళ మాట మాత్రం అనుకుండా వినతులకే పరిమితం అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఇక తాజాగా ఏప్రిల్ లో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధులు గమనిస్తే మరింత కోత పడింది. ఏపీకి కేవలం 1892.64 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ ఏడాది బడ్జెట్ లో 32,213 కోట్లు ఏపీకి కేటాయిస్తామని కేంద్రం చెప్పింది. దాని ప్రకారం నెలకు రెండున్నర వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. కానీ అందులో కూడా సుమారు ఏడెనిమిది వందల కోట్లు తగ్గించడం ఆశ్చర్యంగా మారుతోంది. అసలు కరోనా సహాయ కార్యక్రమాల భారం మోయాల్సిన తరుణంలో ఏటా కేటాయించే దానిలో కూడా కోత విధించడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారబోతోంది. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వాటికి అలాంటి అరకొర కేటాయింపులు మాత్రమే జరిగాయి. బీజేపీ పాలిత యూపీకి అత్యధికంగా 8255 కోట్లు కేటాయించగా, ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి 3వేల కోట్లు కూడా దక్కకపోవడం విశేషం.
ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రానికి పెద్ద గండి పడింది. పైగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా కోత పెట్టారు. దానివల్ల 1500 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోయాయి. ఇప్పుడు పన్నుల వాటాలో కూడా తగ్గించడం తో బడ్జెట్ మరింత భారంగా మారబోతంది. ఇప్పటికే మార్చి నెల వేతనాలను సగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించగలిగింది. ఇప్పుడు వచ్చే నెల విషయం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఎఫ్ ఆర్ ఎం బీ సడలింపు , ఓవర్ డ్రాప్ట్ వంటి విషయాల్లో రాష్ట్రాలు ఆశిస్తున్నంతగా కేంద్రం నుంచి ఆశావాహక పరిస్థితి లేకపోవడం, ఇప్పుడు ఆశ పెట్టుకున్న నిధులు కూడా దక్కకపోవడంతో ఏపీ సహా ఆయా రాష్ట్రాలకు కష్టాలు తప్పేలా లేవు.