iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏడేళ్ల క్రితం నాటి ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటి వరకూ తాత్కాలికంగా నడుపుతున్న గిరిజన యూనివర్సిటీకి మోక్షం కలుగుతోంది. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ ఉండాలని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. త్వరలో యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోని సాలూరు ప్రాంతంలో అభివృద్ధికి ఈ గిరిజన యూనివర్సిటీ ఉపయోగపడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో జగన్ చొరవ ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఆనుకుని ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీ విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతానికి తరలుతోంది. తొలుత ఈ యూనివర్సిటీని 2014లోనే నిర్మించాల్సి ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపకపోవడం, కేంద్రం తాత్సార్యం కలిసి ఇన్నేళ్లకు కార్యరూపం దాలుస్తోంది.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కొత్తవలస మండలం రెల్లి పంచాయతీ పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నించింది. విశాఖ నగరానికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం ఏజన్సీకి వెళ్లే మార్గంలో ఉంటుంది తప్ప ఏజన్సీ ప్రాంతం కాదు. అప్పట్లో 526.24 ఎకరాలు కేటాయించి భూమి చదును చేసే పనులు చేపట్టినా, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీ ఏజన్సీ ప్రాంతంలో ఉంటే అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని భావించింది. చంద్రబాబు అనుచరులు కొందరి భూముల విలువ పెంచడం కోసం కొత్తవలసలో ఆయన ఈ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదిస్తే జగన్ మాత్రం నేరుగా పాచిపెంట మండలం పెదకంచేరులో 400 ఎకరాలకు పైగా స్థలంలో నిర్మించాలని ప్రతిపాదించారు.
పాచిపెంట మండలానికి రవాణా సదుపాయాలు ఆశించినంతగా లేకపోవడంతో ఆ తర్వాత దానిని మెంటాడ, దత్తిరాజేరు మండలాల మధ్య ప్రతిపాదించారు. తాజాగా దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. విజయనగరం మండలం కొండకరకాం లో ఉన్న ఏయూ ప్రాంగణంలోనే 2018-20 నుంచి తాత్కాలిక తరగతులు నిర్వహిస్తున్నారు.
నాలుగు కోర్సులు నిర్వహిస్తున్నాయి. యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మరిన్ని కోర్సులు, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు అవకాశం దక్కుతుంది. పూర్తిస్థాయిలో వర్సిటీ తీర్చిదిద్దడానికి రూ.1200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం కేవలం రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పుడు స్థలం ఖరారు కావడంతో నిధులు పెద్ద మొత్తంలో వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. తద్వారా విజయనగరం, అందులోనూ ఏజన్సీ ప్రాంత అభివృద్ధికి ఈ కొత్త యూనివర్సిటీ తోడ్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : Kcr Mamata – కేసీఆర్ కు దక్కనిది.. మమతకు దక్కింది -ఇద్దరు సీఎంల విషయంలో మోదీ భిన్నవైఖరి ఎందుకో?