దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మూడవ దశ విజృంభిస్తోంది. అధికారికంగా మూడవ దశ అని చెప్పనప్పటికీ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని మరో మారు కరోనా కాటేస్తోంది. ఈసారి సినీ, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఈ మహమ్మారి మొదలయ్యాక చాలామంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. కరోనా మొదలయ్యాక దేశవ్యాప్తంగానే కాక ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలకు కరోనా సోకింది. కొంతమంది కరోనా నుంచి కోలుకుంటే మరికొందరు కరోనాతో కన్నుమూశారు.. ముందుగానే కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా రాజకీయంగా ప్రజలతో మమేకం కావాల్సిన పరిస్థితుల్లో రాజకీయ నేతలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది . ఏపీలో ఏకంగా ఒక్కరోజే పదివేల కేసులు నమోదయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు చాలామంది ఈ వైరస్ కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, భానోత్ శంకర్ నాయక్ లకు కరోనా నిర్ధారణ అయింది. అలాగే ఏపీలో మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు.
కేవలం వీరే కాదు.. రాజకీయ నేతల సన్నిహితులు, రక్త సంబంధీకులు సైతం భారీగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సతీమణి శచీదేవికి కూడా కరోనా సోకింది. ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్, వంగవీటి రాధా, దేవినేని ఉమా వంటి వారు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా తెలంగాణకు చెందిన మల్కాజ్గిరి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇలా రాజకీయ నేతలంతా వరుస కరోనా బారిన పడుతున్నారు.
Also Read : నారా లోకేష్ కు కరోనా