Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జల వివాదాల పరిష్కారానికి రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. గతంలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తేదీ ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో అది వాయిదా పడింది.. ఆ తర్వాత , ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ, ఏపీకి సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ. దీంతో.. ఇరు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవివాదాలపై 25వ తేదీన అత్యున్నత మండలి సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌తో కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు సిద్దమవుతున్నారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి రెండు రాష్ట్రాల సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. అయితే సమావేశం వాయిదా పడే అవకావాలు ఉన్నాయి. దీనికి కారణం కరోనా..!
గజేంద్ర షెకావత్ కు కరోనా
కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కరోనా బారిన పడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డాక్టర్ల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. అటు కేంద్రం.. ఇటు తెలుగు రాష్ట్రాలు జల వివాదాల పరిష్కారానికి సిద్ధమవుతున్న వేళ గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో సమావేశం నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే తమ వాదనలను వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిలో సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.