iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు ఈనాటిది కాదు. ఆ సమస్య పరిష్కారం ఒక్కరోజుతో సాధ్యం కాదు. అయినా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరుని కేంద్రమే కొనియాడింది. పార్లమెంట్ వేదికగా లెక్కలతో ముందుకొచ్చింది. పట్టుబడిన గంజాయి పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఏపీలో గంజాయి వ్యవహారాలపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడిన గంజాయి మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్రం స్పష్టం చేసింది. అంటే చంద్రబాబు హయంలో దర్జాగా సాగిపోయిన దందాకి జగన్ వచ్చిన తర్వాత బ్రేకులు పడినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుక, మద్యం సహా అక్రమ రవాణా వ్యవహారాలపై ప్రత్యేకంగా రంగంలో దిగిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సత్ఫలితాన్నిస్తుందని స్పష్టమయ్యింది. జగన్ ప్రభుత్వ ప్రయత్నాలను కేంద్రమే ఖరారు చేసింది.
2018 లో అంటే చంద్రబాబు హయంలో 33 వేల 839 కిలోల గంజాయి ఆధారిత ఉత్పత్తులను పట్టుకున్నట్టు లెక్కలు చెప్పింది. నారోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్స్ సబస్టాన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదయిన వివరాల ప్రకారం 2019లో అది రెట్టింపయ్యింది. 66,605 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో అది ఏకంగా 1లక్షా 6వేల 42 కిలోలు దొరికింది. అంటే అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గత ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం మూడు రెట్లు అదనంగా అడ్డుకోవడం విశేషం. అందులోనూ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా 2020లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకోవడం ద్వారా వాటి అక్రమ రవాణా విషయంలో జగన్ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందన్నది స్పష్టమవుతోంది.
అదే సమయంలో రవాణాతో పాటుగా సాగు విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా చేపడుతోందని కేంద్రం పార్లమెంట్ కి తెలిపింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భారీగా గంజాయి తోటలు ధ్వంసం చేసే కార్యక్రమం సాగుతోంది. గంజాయి సాగుదారులను ఇతర పంటల వైపు ప్రోత్సహించే ప్రయత్నం ఉధృతంగా సాగుతోంది. ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగి గిరిజనులను చైతన్యవంతులు చేసే ప్రక్రియ పెద్దస్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే వందల ఎకరాల్లో గంజాయిపంటను ధ్వంసం చేయడం విశేషం. అటు రవాణా, ఇటు సాగు విషయంలో జగన్ ప్రభుత్వ నియంత్రణ విషయంలో చురుగ్గా ఉందనే విషయం కేంద్రం సుస్పష్టంగా వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ నేతలు నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది.
ముఖ్యంగా చంద్రబాబు హయంలో కన్నా జగన్ ప్రభుత్వంలోనే గంజాయిని అడ్డుకుంటున్నట్టు అధికారిక లెక్కలు పార్లమెంట్ సాక్షిగా వెల్లడయిన తరుణంలో చంద్రబాబు ఏం చెబుతారో చూడాలి. ఏపీలో ఎక్కడో ఏవోబీఓ గంజాయి సాగు జరుగుతుంటే దానిని కూడా జగన్ కి ముడిపెట్టి విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఈ లెక్కలు మింగుడుపడే అవకాశం లేదు. గంజాయి రవాణాని అడ్డుకోవాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కారు మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని చూసిన ప్రతిపక్ష బాబు బ్యాచ్ కి ఈ వ్యవహారం చెంపపెట్టుగా మారిందనే చెప్పాలి.
Also Read : Central Government – రామాయపట్నానికి రాం రాం అంటున్న కేంద్రం