iDreamPost
android-app
ios-app

ఎంత పెద్ద మనసు..!

ఎంత పెద్ద మనసు..!

దేశానికి అన్నం పెట్టే వ్యవసాయం అన్నా.. రైతులన్నా కే్రంద ప్రభుత్వానికి ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేం. కరోనా కష్టకాలంలోనూ దేశానికి అన్నం పెట్టేందుకు భూమి పుత్రులు నిత్యం చెమట చిందిస్తూనే ఉన్నారు. అందుకేనేమో వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు 20 లక్షల కోట్ల రూపాయాల భారీ ప్యాకేజీలో 6,700 కోట్ల రూపాయలు కేటాయించి తన పెద్ద మనసును చాటుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 6,700 కోట్ల రూపాయల మూలనిధితో దేశంలో అన్నదాతలు పండించిన వివిధ రకాల ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలకు గిట్టుబాటు ధర రాని సమయంలో కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయనుందట.

రైతులకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వమే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రకంటించిన మూల నిధి 6,700 కోట్ల రూపాయలను చూసి రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మొత్తం నిధులు ఎప్పటికి ఖర్చు అవుతాయో అర్థం కాక లెక్కలు వేసుకుంటున్నారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి. ఖరీఫ్, రబీ, వేసవి అనే మూడు సీజన్లు ఒక ఏడాదిలో ఉన్నాయి. వీటిని ఆయా ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం రబీ సీజన్‌ ముగిసింది. పంట చేతికొచ్చింది. మామిడి, బత్తాయి, అరటి, సపోటా, ద్రాక్ష, పుచ్చ తదితర పండ్లకు ఇదే సీజన్‌. ఇక కూరగాయల సాగు నిత్యం ఉండేదే.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్‌ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రవాణా వ్యవస్థ ఆగిపోయింది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దళారీలు, వ్యాపారులు రావడంలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వరి, మొక్కజొన్న, కందులు, మినుములు తదితర పంటల ఉత్పత్తి విలువ దాదాపు 80 వేల కోట్ల రూపాయలని అంచనా. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పంట ఉత్పత్తుల విలువ ఎంత ఉంటుందో అంకెల్లో చెప్పలేము. అలాంటిది ఈ కష్టకాలంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంటూ 6,700 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నదాతలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పేమ్రను చూపుతోంది. ఈ మొత్తాన్ని నిర్మలా సీతారామన్‌ ఒత్తి మరీ పలకడం మహా గొప్పగా ఉంది.