iDreamPost
android-app
ios-app

బ్రిటన్‌ నుంచి భారీగా వచ్చిన తెలుగువారు

  • Published Dec 25, 2020 | 1:10 PM Updated Updated Dec 25, 2020 | 1:10 PM
బ్రిటన్‌ నుంచి భారీగా వచ్చిన తెలుగువారు

గత నెల రోజుల వ్యవధిలో యూకే నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు 1268 వచ్చినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వీరిలో 1200 మంది తెలంగాణాకు రాగా, 68 ఏపీకి వచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ 68 మందిలోనూ చిత్తూరు జిల్లాకే 38 మంది వచ్చినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు కొత్త కరోనా వైరస్‌ జాడలు మాత్రం ఇంకా స్పష్టంగా ఖరారు కాలేదనే చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా యూకే నుంచి వచ్చిన వారు ఆరువేల మందికిపైగా ఉన్నట్లుగా తేల్చారు. దీంతో వీరిని గుర్తించి, శాంపిల్స్‌ సేకరించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) పరిసర ప్రాంతాల్లో కొత్త తరహా కరోనా వైరస్‌ వ్యాపిస్తూ అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించిన వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఆయా దేశాలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా మనదేశం కూడా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. ఐసీయంఆర్‌ ఆదేశాల ప్రకారం తగు జాగ్రత్తలు పాటిస్తోంది.

యూకే నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు 1268 మంది రాగా, తమిళనాడుకు 2,724 మంది, కేరళకు 2,116, కర్నాటకకు 2,127 మంది ఉన్నట్లుగా ప్రస్తుతం వెల్లడైన నివేదికలను బట్టి తెలుస్తోంది. వీరందరిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

ముప్పు ఎక్కువ ఎవరికి..

ఇటీవల బైటపడ్డ కొత్త కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తేలింది. గత వైరస్‌ కంటే 58 నుంచి 70శాతం వరకు వేగంగా ఈ వైరస్‌ వ్యాప్తి ఉందని పలు పరిశోధక సంస్థలు స్పష్టం చేసాయి. ఇంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్‌ జనసమ్మర్ధం ఉన్న దేశాలకు పెనుముప్పుగానే పరిగణిస్తుందని వైద్యరంగ ప్రముఖులు చెబుతున్నారు. అత్యంత జనసాంద్ర ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్‌గనుక ప్రవేశిస్తే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం మన దేశంలోకి యూకే తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వైద్య పరీక్షలు చేపట్టడంతో పాటు, కోవిడ్‌ పాజిటివ్‌లుగా తేలిన వారికి ప్రత్యేకంగా క్వారంటైన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించేందుకు వారి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన నివేదికలను బట్టి భారత్‌లో ఇంకా కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించలేదని మాత్రం కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.

అయితే యూకే నుంచి వచ్చిన వారందరికి వైద్య పరీక్షలు పూర్తయితే తప్ప దీనిపై క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉండదన్న వాదన కూడా లేకపోలేదు.