iDreamPost
iDreamPost
తమిళనాడు థియేటర్లలో వంద శాతం సీటింగ్ కు అనుమతులు వచ్చేశాయి కదా మన ముఖ్యమంత్రులు కూడా రేపో ఎల్లుండో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్న పరిశ్రమ వర్గాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. సదరు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని చెబుతూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పష్టమైన సూచనలతో కూడిన ఆదేశాలు పళనిస్వామి టీమ్ కు అందాయి. ఇప్పుడు ఈ ఆర్డర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాస్టర్ విడుదల సందర్భంగా హీరో విజయ్ చేసిన విన్నపాన్ని వెంటనే ఆమోదించిన తమిళ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఇరకాటంలో పడింది. ఖచ్చితంగా నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు.
గత మూడు రోజులుగా ఇదే విషయమై అక్కడ నిరసన సెగలు వినిపిస్తున్నాయి. పలువురు డాక్టర్లు ఈ చర్య పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పది నెలలుగ ఎన్నో త్యాగాలు చేసి పరిస్థితిని ఒక కొలిక్కి తెస్తే సినిమా హాళ్ల రూపంలో మళ్ళీ మరణ మందిరాలు తెరుస్తారా అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. విజయ్ కేవలం వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచించి సిఎంని కలిశారు తప్ప ఆయనకు ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి చింత లేదని నిలదీశారు. దీని మీద హాట్ ఆర్గుమెంట్స్ జరుగుతున్న సమయంలోనే సెంట్రల్ నుంచి ఇప్పుడీ ట్విస్ట్ రావడం థ్రిల్లర్ సినిమా రేంజ్ లో ఉంది.
ఇక టాలీవుడ్ జనాలు యాభై శాతానికి ఫిక్స్ అయిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటిదాకా ఏదైనా పాజిటివ్ గా ఆలోచించి ఉంటే ఇకపై మన ప్రభుత్వాలు ఎలాంటి రిస్క్ తీసుకోవు. సో పండగ బరిలో నాలుగు సినిమాలు రెవిన్యూ విషయంలో రాజీ పడక తప్పదు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. సగం సీట్లతోనే టికెట్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఇక పొడిగించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడీ పరిమాణం వల్ల మాస్టర్ ఏమైనా వాయిదా పడుతుందా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కానీ ఆ ఛాన్స్ లేనట్టే. ఇప్పుడు వెనక్కు తగ్గితే విజయ్ ప్రత్యేకంగా టార్గెట్ అవుతాడు. చూద్దాం ఏం జరగనుందో.