Idream media
Idream media
ఒకేరోజు అన్నిచోట్లా రసవత్తర చర్చలు
ఒకే రోజు అటు కేంద్రం, ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమావేశాలు, చర్చలతో బిజీ.. బిజీగా గడిపాయి. ఆంధ్రప్రదేశ్ లో బీఏసీ, అసెంబ్లీ సమావేశాలతో రాజకీయ హీట్ పెరిగింది. ఏపి అసెంబ్లీ సమావేశంలో మొదటి రోజున నల్ల రంగు వస్త్రాలు ధరించి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే అచ్చెం నాయిడు, మాజీ ఎమ్మెల్సీ జెసిప్రభాకర్రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన నిరసన ప్రదర్శనలో నారా లోకేష్,మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
తదనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన వెల్లడించారు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా మీద పడ్డాయి అని చెప్పారు. అంతకు ముందు బడ్జెట్ ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యవసరమని, అందు వల్ల మూడు రాజ ధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తోంది. అక్రమ అరెస్టుల పేరుతో అసెంబ్లీ నుంచి వాక్ ఔట్ చేసి ప్రజా సమస్యలపై చర్చకు దూరమైంది. ప్రభుత్వం మాత్రం ప్రజా రంజక బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
మరో వైపు.. తెలంగాణలోనూ హాట్ టాపిక్ లపై ముఖ్యమంత్రి కేసిఆర్ సమావేశాలు నిర్వహించారు. ప్రగతిభవన్ లో కలెక్టర్లు, అధికారుల తో సమావేశం అయ్యారు. వ్యవసాయం, కరోనా, నిధులు, విధులపై సుదీర్ఘంగా చర్చించారు. కావల్సినన్ని నిధులు, సిబ్బంది ఉండి కూడా గ్రామాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులపై దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి మరింత పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఇదే రోజు…ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం లతో మీటింగ్ లకు ఈరోజే శ్రీకారం చుట్టారు. 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయా రాష్ట్రాల సీఎంలను అడిగి తెలుసుకున్నారు. కట్టడికి వారు తీసుకోవాల్సిన, కేంద్రం చేపడుతున్న పనులను వివరించారు. ఆర్థిక స్థితగతులను కొంత మంది సీఎం లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మన తెలుగు రాష్ట్రాల సీఎం లతో రేపు మాట్లాడ నున్నారు.
మొత్తంమీద అటు కేంద్రం, ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకేరోజు సమావేశాలు నిర్వహించడంతో ఎవరు ఏమి ప్రకటిస్తారో అని తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా టీవీలకు అతుక్కు పోయారు.