iDreamPost
iDreamPost
విభజన చట్టంలో లేదనే పేరుతో ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. పార్లమెంట్ లో ప్రధాని ఇచ్చిన హామీ అమలు చేయడానికి ససేమీరా అని చెప్పేసింది. చివరకు స్వయంగా నరేంద్ర మోడీ తిరుపతి సభలో ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేసింది. అదంతా మరచిపోతున్న దశలో ఇప్పుడు పోలవరం పుండు రాజేస్తోంది. విభజన చట్టంలో అన్ని రకాలుగా తెలంగాణాకి మేలు చేస్తున్నందున ఏపీకి అనేక రూపాల్లో సహాయం చేస్తామని పేర్కొన్నారు. అందులో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా. దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే. అప్పటికే ఏపీ ప్రభుత్వం తరుపున వైఎస్సార్ హయంలో కాలువల నిర్మాణం, ఇతర పనుల కోసం 5వేల కోట్లు వెచ్చింది. ఇక మిగిలిన మొత్తం కేంద్రం భరించి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం తీవ్ర జాప్యం చేసింది. గడిచిన 8 బడ్జెట్లలోనూ కలిపి ఏపీకి 8వేల కోట్లు కూడా ఇచ్చింది. లేదు. అంటే సకాలంలో నిధులు చెల్లించని కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగింది. గడిచిన రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాల మూలంగా పనుల్లో వేగం కనిపిస్తోంది. స్పిల్ వే నిర్మాణం పూర్తికావడం, ఏకంగా నదిని మళ్లించడం వంటివి అందరికీ కనిపిస్తున్నాయి. అయినా కేంద్రం మాత్రం కదలడం లేదు. గడిచిన ఏడేళ్లలో పెరిగిన నిర్మాణ వ్యయానికి బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ దానికి ససేమీరా అంటూ ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. పోలవరం భవిష్యత్తుని ఊగిసలాటలోకి నెడుతోంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే ఇంకా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ లను పూర్తి చేసి ప్రభుత్వం నదీ ప్రవాహాన్ని మళ్లించింది. దాంతో పాటుగా పవర్ ప్లాంట్ కూడా ప్రాజెక్టులో భాగంగా మొదటి నుంచీ ఉంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం మూలంగా పునరావాస వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. అది పూర్తిగా చెల్లించి బాధితులకు న్యాయం చేయాలి. వాటన్నింటినీ కేంద్రమే చేయాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉంది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కి మాత్రమే తాను బాధ్యత వహిస్తానని చెబుతోంది. అదే ఖాయం చేసినప్పటికీ డీపీఆర్ 2 ప్రకారం 55వేల కోట్లకు అంగీకరించాలి. ఇప్పటి వరకూ 8 కోట్లు మాత్రమే ఇచ్చిన మోడీ ప్రభుత్వం మిగిలిన మొత్తం చెల్లించి జాతీయ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలి.
ఏపీలో బీజేపీ నాయకులు మాత్రం అంతా కేంద్రమే నిర్మిస్తోందని ప్రకటనలు గుప్పిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తారు. 2014 నాటి అంచనాల ప్రకారమే 20వేల కోట్లకే ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం అంటోంది. కానీ ఇప్పటికీ పునరావాసం పూర్తి చేయడానికే మరో 20వేల కోట్లు అవసరం అవుతాయన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్న లెక్క. అంటే పునరావాసం పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం కూడా కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సాకుగా చూపుతున్నారు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అప్పట్లో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి వాళ్లు రెండు లక్షల కోట్లు వస్తుందని చెప్పిన మాటలను చంద్రబాబు వల్లించి, ప్యాకేజీ ఇవ్వడమే కేంద్రం చేసిన ఘనకార్యంగా చిత్రీకరించిన మూలంగా ఇప్పుడు కేంద్రం తన బాధ్యతనుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టవుతోంది.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రీత్యా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం నిధులకు పరిమితులు పెడుతూ కొత్త సమస్యలను ముందుకు తీసుకువస్తోంది. ఏపీ అభివృద్ధి పట్ల కేంద్రం ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందనే ఆరోపణలకు అవకాశం ఇస్తోంది. ఇప్పటికే రైల్వే జోన్ వంటివి కూడా ప్రకటనలకే పరిమితం కాగా, ఇప్పుడు పోలవరం ఆశలు తుంచేసేలా సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గోదావరి జలాలు ఇప్పటికే వృధాగా తరలిపోతుండగా , సద్వినియోగం చేసుకునే మార్గాన్ని చేజేతులా వదులుకునేలా కేంద్రం తీరు ఉంది.
ఓవైపు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై పెత్తనం కోరుతూ, మరోవైపు ఉన్న వనరుల వినియోగానికి అవసరమైన నిధులు చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మొండిచేయి చూపడం అనుమానాలను పెంచుతోంది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంటుంది. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ప్రజలు కోరుతున్నారు.