iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రుణభారంపై కేంద్రం సీరియస్.. మోడీ ఆగ్రహం…ఏపీకి అప్పుల్లో కోత.. జగన్ ప్రభుత్వానికి వాత అంటూ రకరకాల హెడ్డింగులు పెట్టుకుని సంతృప్తి పడిన బ్యాచ్ కి చెంపదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో విఫలమయ్యిందని, ఏకంగా కేంద్రమే జోక్యం చేసుకోవాలని వాదించిన వారికి వాయింపు తప్పలేదు. ఆర్థిక ఎమర్జెన్సీ విధిచాలంటూ లేఖలు రాసినవాళ్లకు తాజాగా కేంద్రం లేఖ పెద్ద ఎదురుదెబ్బగా ఉంది. జగన్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ విషయంలో కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటిని సమాధానపరచడంతో అంతా సజావుగా సాగుతుందనే విషయం మరోసారి స్పష్టమయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల ఆర్థిక రుణపరిమితిని పెంచుతూ కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ లేఖరాయడం జగన్ వ్యతిరేకులకు మింగుడుపడే అవకాశం లేదు.
గడిచిన రెండు నెలలుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, వారి అనుంగు పచ్చ మీడియా కూడా చాలా ఆయాస పడింది. ఏపీకి అప్పులు భారం పెరిగిపోయిందంటూ వల్లించని రోజు లేదు. జనాల్లో ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేయని రోజు లేదు. కానీ తీరా చూస్తే కేంద్రమే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించింది. రుణ పరిమితి పెంచడానికి అంగీకరించింది. పీఏసీ చైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు రూ. 43వేల కోట్లు ఏమయ్యాయంటూ చేసిన హంగామా, ఆ తర్వాత అప్పుల కుప్పలంటూ ఈనాడు రాసిన రాతలు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వక్రభాష్యపు కహానీలు కూడా చెల్లలేదు. ఏపీ ప్రభుత్వానికి మరో రూ. 10,500 కోట్ల రుణాలకు అనుమతించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఏడాది రుణ పరిమితిని రూ. 31,251 కోట్లకు పెంచింది.
Also Read:చంద్రబాబుకు ఆ పీఏ తో తలవంపులు తప్పవా?
వాస్తవానికి జీఎస్ డీపీ ప్రకారం ఏపీ ప్రభుత్వం సుమారుగా రూ. 47వేల కోట్ల వరకూ అప్పులకు అవకాశం ఉంది. కానీ 2016 నుంచి 2019 వరకూ వరుసగా మూడేళ్ల పాటు పరిమితికి మించి అప్పులు చేసిన టీడీపీ ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఈ ఏడాది అప్పుల్లో రూ. 16వేల కోట్ల మేరకు కోత పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అంటే చంద్రబాబు చేసిన తప్పిదాలకు జగన్ సర్కారు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయమై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రంతో మంతనాలు జరిపారు. ఆర్థిక శాఖ అనుమానాలు తీర్చారు. అనేక అంశాలలో వచ్చిన సందేహాలన్నింటికీ సమాధానాలిచ్చారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను కేంద్రానికి తేటతెల్లం చేశారు. వాటితో సంతృప్తి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వ వాదనను అంగీకరించింది. ఆర్బీఐకి లేఖ రాసింది.
ఏపీలో అభివృద్ధి నిలిచిపోవాలని, అప్పులు పుట్టక, ఆదాయం రాక జగన్ ప్రభుత్వ నిర్వహణే ముందుకు సాగని స్థితి వస్తుందని టీడీపీకి చెందిన చాలామంది ఆశించారు దానికి అనుగుణంగానే అన్ని రకాల అడ్డుపుల్లలు వేసే యత్నం చేశారు. తీరా చూస్తే వాళ్లందరి అంచనాలు తలకిందులు చేస్తూ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి లోటు రాకుండా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా వ్యవహరించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తన సమర్థతను చాటుకుంటోంది. జగన్ సర్కారు గురించి చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొడుతూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఇదో కీలక అడుగుగా భావించాల్సి ఉంటుంది.
Also Read:జెండా ఏదైనా అజెండా బాబుదే!