iDreamPost
android-app
ios-app

రెవెన్యూ లోటు భర్తీ చేయడంలోనూ కేంద్రం కొర్రీలు, సగం నిధులే ఇస్తామంటూ షరతులు

  • Published Jan 14, 2022 | 2:22 AM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
రెవెన్యూ లోటు భర్తీ చేయడంలోనూ కేంద్రం కొర్రీలు, సగం నిధులే ఇస్తామంటూ షరతులు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. లోటు భర్తీకి అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ విభజన చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటిపోయినా ఆ దిశలో మోదీ సర్కారు నిర్ణయం తీసుకోలేదు. లోటు విషయంలో తగిన నిధులు కేటాయించేందుకు ముందుకు రాలేదు.

ఈవిషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ అంటూ హడావిడి చేసి ఆఖరికి ఏపీని నట్టేట ముంచింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం గడిచిన మూడేళ్లుగా లోటు భర్తీ నిధుల విషయంలో పలుమార్లు పట్టుబట్టింది. వివిధ సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇటీవల ప్రధానితో భేటీ సమయంలోనూ సీఎం జగన్ ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాంతో చివరకు ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూలోటు విషయంలో నిధుల విడుదలకు కేంద్రం నిర్ణయం తీసుకునే దిశలో అడుగులు వేస్తోంది.

అయితే ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 22,948 కోట్ల మేరకు రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉంది. కానీ కేంద్రం మాత్రం అందులో సగం కూడా ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా వివిధ పద్దులను ముందుకు తెస్తోంది. 2014-19 మధ్య వివిధ పథకాల కింద ఇచ్చిన నిధుల లెక్కలను చూపుతూ ఇప్పుడు లోటు భర్తీ విషయంలో కొర్రీలు వేస్తోంది. కేవలం రూ. 10,987 కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెబుతోంది. దానికి మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదనే రీతిలో కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖల నుంచి వస్తున్న సంకేతాలు ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇది కేంద్రం ఏపీ పట్ల చూపుతున్న సవతి ప్రేమకు తార్కాణంగా కొందరు సందేహిస్తున్నారు.

విభజన తర్వాత మొదటి ఆర్థిక సంవత్సరం రెవెన్యూలోటు రూ. 16,790 కోట్లు. కాగా అందులో ఇప్పటి వరకూ కేవలం రూ. 2303 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఇక మిగిలిన రూ. 13,776 కోట్లు ఏపీకి రావాల్సి ఉందని కాగ్ నివేదికలో కూడా పేర్కొన్నారు. దాంతో ఈ నిధులు కేంద్రం నుంచి వస్తాయని ఏపీ ప్రభుత్వం ఆశాభావంతో అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తాజాగా అందులో రూ. 11,961 కోట్లను తిరస్కరిస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి 3వేల కోట్లు, రైతు సాధికారిక సంస్థకు 4వేల కోట్లు, వృద్దాప్య ఫించన్లకు 3,300 కోట్లు, డిస్కమ్ ల బలోపేతానికి 1500 కోట్లు చొప్పున కేంద్రం గతంలో ఇచ్చినందున ఇప్పడు వాటిలో కోత విధించబోతున్నట్టు చెబుతోంది.

ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఇలా కేంద్రం కొర్రీలు వేస్తూ నిధుల్లో కోత పెడితే అత్యంత దయనీయంగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సిన చోట కూడా వివిధ అంశాలను ముందుకు తీసుకొచ్చి నిధుల్లో కోత పెట్టడం సమర్థనీయం కాదని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రెవెన్యూలోటు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ దానికి భిన్నంగా వివిధ పథకాల కింద ఇచ్చిన నిధులను చూపుతూ లోటు భర్తీని తిరస్కరించడం సమంజసం కాదని చెబుతున్నారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడతామని చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత కుంగతీసేందుకు ప్రయత్నిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.