iDreamPost
iDreamPost
మహామహులు వెళ్లారు..రోజుల తరబడి మకాం వేశారు. గల్లీ గల్లీ తిరిగారు. చివరికి రెండు వార్డులే సాధించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారైంది మీ నిర్వాకం..అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా నేతలపై సీరియస్ అయ్యారు. గత నెలలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని పెనుకొండ మున్సిపల్ ఫలితాలపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. డజన్ల కొద్దీ నాయకులు వెళ్లి ఏం సాధించారని నేతలను సూటిగా ప్రశ్నించారు. అలసత్వం వల్లే దారుణ ఓటమి చవి చూడాల్సి వచ్చిందని.. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అధినేత అంత తీవ్రంగా స్పందిస్తారని ఊహించని పార్టీ నేతలు బిక్క చచ్చిపోయారు.
సత్తా చూపుతామని.. చతికిల పడిన టీడీపీ
గత నెలలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ నుంచి మున్సిపాలిటీ హోదా పొందిన పెనుకొండకు కూడా తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పం తర్వాత రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించింది పెనుకొండ ఎన్నికలే. 1992 నుంచి పరిటాల కుటుంబానికి, టీడీపీకి పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం దుర్భేద్యమైన కోటగా పేరు పడింది. అటువంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఆ పార్టీ నుంచి శంకర నారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు.
Also Read : TDP, Andhra Jyothi, Rosaiah, YS Jagan – రోశయ్య మరణాన్ని కూడా వాడుతున్నారు.. వీళ్ళు మారరా..?
నియోజకవర్గ కేంద్రమైన పెనుకొండ మున్సిపాలిటీకి ఎన్నికలు రావడంతో అక్కడ గెలిచి సత్తా చాటాలని టీడీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మేరకు జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలందరూ అక్కడ వాలిపోయారు. వారంతా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలే. వారితోపాటు ఇతరత్రా కీలక పదవులు నిర్వహించిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఆ స్థాయి నాయకులే వార్డుకు ఒకరు ఇంఛార్జీలుగా వ్యవహరించారు. పది రోజులపాటు అక్కడే మకాం వేసి ప్రచారంతో ఊదరగొట్టారు. తీరా ఫలితాలు చూసి కంగుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను రెండంటే రెండే వార్డులు టీడీపీకి దక్కాయి. మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ భారీ మెజారిటీలతో విజయం సాధించింది.
అలసత్వం వహిస్తే ఇంటికే
ఈ దారుణ ఓటమి పార్టీ అధినేతకు మింగుడుపడలేదు. అనంతపురం నేతలను విజయవాడ పిలిపించి పెనుకొండ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా నేతలందరూ పాల్గొన్న ఈ సమీక్షలో చంద్రబాబు నేతలపై బాగా సీరియస్ అయ్యారు. పార్టీకి మంచి పట్టున్న చోట కూడా ఇంత దారుణ ఫలితాలు సాధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడటం వల్లే ఓటమి చెందామన్న నేతల వివరణలను ఆయన అంగీకరించలేదు. పెద్ద సంఖ్యలో నాయకులు వెళ్లినా సమన్వయం లోపించిందని.. దానికి అలసత్వం తోడు కావడం వల్లే పరాభవానికి గురయ్యామని తేల్చి చెప్పారు. ఇకముందు అలసత్వం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హిందూపురం పార్లమెంటు ఇంఛార్జి బీకే పార్థసారధి పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని వెళ్లడం లేదని తప్పు పట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నవన్నీ తన దృష్టికి వస్తున్నాయని.. పార్టీలో త్వరలో మార్పులు ఉంటాయని, వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.
Also Read : Ap Cm Ys Jagan – పేదల గుండెల్లో “గూడు” కట్టుకుంటున్న జగన్