iDreamPost
iDreamPost
ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష పూర్తి చేశారు. 12గం.ల పాటు సాగించిన ఆయన దీక్షలో ఆశించిన ఫలితాలు ఏమేరకు దక్కాయన్నది టీడీపీ శ్రేణుల్లోనే సందేహంగా మారింది. వాస్తవానికి చంద్రబాబు కార్యక్రమాలకు మీడియా కవరేజ్ అసామాన్యంగా ఉంటుంది. మీడియాలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఉన్న సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఎపిసోడ్స్ తో బాబు శ్రమ మొత్తం హైజాక్ అయిపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్ సర్కారుపై ప్రారంభం నుంచే టీడీపీ దూకుడుగా సాగుతోంది. అధికారం కోల్పోయిన రెండు నెలలకే ఆందోళనలకు పూనుకుంది. ఛలో ఆత్మకూరు అంటూ సెప్టెంబర్ నుంచే రోడ్డెక్కింది. ఆ తర్వాత ఇసుక పేరుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఇక ఇప్పుడు నేరుగా అధినేత రంగంలోకి వచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షకు తగిన ఫలితం దక్కకపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం నేతలను కొంత నిరాశపరిచినట్టుగా కనిపిస్తోంది.
చంద్రబాబు దీక్షకు పూనుకున్న కొన్ని గంటల్లోనే దేవినేని అవినాష్ రాజీనామా అస్త్రం సంధించారు. తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన మరునాడే తెలుగుయువత అధ్యక్షుడు పార్టీని వీడడం విశేషంగా చెప్పవచ్చు. ఆ వెంటనే జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడంతో విజయవాడ రాజకీయాల్లో కొత్త వేడి రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంతలోనే గన్నవరం వ్యవహారం మరింత ఘాటుగా మారింది. వల్లభనేని వంశీ తన శైలి కామెంట్స్ తో కలకలం రేపారు. నేరుగా నారా లోకేశ్ ని , ఆయన నడుపుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ని టార్గెట్ చేయడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన బాబూ రాజేంద్రప్రసాద్ మీద విరుచుకుపడిన తీరు హాట్ టాపిక్ గా మారింది.చంద్రబాబు దీక్షకు మైలేజీ వస్తుందని ఆశించిన టీడీపీకి ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు. పైగా సొంత సామాజికవర్గానికి చెందిన కీలక నేతలే చేజారిపోవడం సమస్యగా మారింది. టీడీపీ తిరోగమనంలో ఉందనే అభిప్రాయం బలపడేందుకు ఈ పరిస్థితి మరింత ఊతమిస్తోంది. ఇలాంటి స్థితి నుంచి టీడీపీ ఎప్పటికి కోలుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది