వారి స్నేహం చెదిరింది. ఈసారి గుడివాడలో కొడాలి నానికి గట్టి ప్రత్యర్థి దొరికారు. వంగవీటి రాధాకృష్ణ మళ్లీ టీడీపీలో క్రియాశీలకంగా మారతారు. గుడివాడ నుంచి ఆయన పోటీ చేస్తారు. నానికి చెక్ పెడతారు అంటూ సాగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. తమ స్నేహానికి ఢోకా లేదని వాళ్లిద్దరూ చాటి చెప్పారు. అంతేగాకుండా గుడివాడలోనే ఓ ఫంక్షన్ లో కలిసిన ఇద్దరూ గంట సేపు జరిపిన చర్చల సారాంశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ఆదివారం సాయంత్రం గుడివాడకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుని ఇంట పుట్టిన రోజు వేడుక సందర్భంగా కలిసిన కొడాని నాని, వంగవీటి రాధా ఏం చర్చించారన్నది టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. రాధా మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలకు ఆస్కారమిచ్చింది.
కృష్ణా జిల్లాలో టీడీపీ కొంతకాలంగా కష్టకాలం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఇద్దరు మిత్రులు కలిసి చంద్రబాబుకి సవాల్ గా మారారు. గుడివాడలో కొడాలి నాని గడిచిన దశాబ్దకాలంగా అంతుబట్టకుండా ఉన్నారు. బాబు చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. కొడాలి నానికి గుడివాడ పెట్టని కోట అన్నట్టుగా తయారయ్యింది. ఇక తాజాగా గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ వ్యవహారం అదే రీతిలో తోడయ్యింది. గుడివాడతో పాటుగా గన్నవరం నియోజకవర్గంలో కూడా టీడీపీకి తగిన నాయకుడే దొరకని దుస్థితి ఏర్పడింది.
Also Read : రాజకీయాల్లో పెద్దరికం అంటే అలాంటి వారిదే
ఈ నేపథ్యంలో గుడివాడ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని అక్కడి నుంచి బరిలో దిగేందుకు వంగవీటి రాధా సిద్ధమవుతున్నారంటూ టీడీపీ క్యాంప్ నుంచి ప్రచారం మొదలయ్యింది. అయితే సుదీర్ఘకాలంగా స్నేహితులయిన రాధా నేరుగా నానితో కయ్యానికి దిగుతారా అనేది చాలామందిని వేధించిన ప్రశ్న. అయితే ప్రస్తుతం అలాంటి అవకాశం లేదని వారిద్దరి కలయిక చెబుతోంది. ఆత్మీయుల మధ్య విబేధాలు పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అవి చెల్లవని వారు చాటిచెప్పారు. వారి అనుచరులు కూడా పార్టీలు వేరయినా వారిద్దరూ స్నేహితులేనంటూ తెలిపారు. త్వరలోనే కలిసి పనిచేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే రీతిలో మాట్లాడడంతో గుడివాడ రాజకీయాలు మరో మలుపు తిరిగినట్టయ్యింది.
వాస్తవానికి వంగవీటి రాధా తన మిత్రుల మాట విని ఉంటే ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా గెలిచి ఉండేవారు. ఆయనకు ఎంపీ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా వెనుకబడిపోయారు. జగన్ మాట కాదని చంద్రబాబు ని నమ్మినప్పటికీ రాధాకి తగిన స్థానం దక్కలేదు. చివరకు ఎమ్మెల్సీ పదవి వంటివి ఊరించి నిరాశపరిచారు. దాంతో మళ్లీ బాబు వెంట నడవడం ఎండమావుల ప్రయాణం లాంటిదేనని రాధాకి సన్నిహితులు చెబుతున్న సూచన. ఈ పరిస్థితుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ వైపు వచ్చేందుకు ఆయన సిద్ధపడే అవకాశాలు లేకపోలేదని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొడాలి నాని వ్యూహాత్మకంగా చక్రం తిప్పడం ఆసక్తిగా కనిపిస్తోంది.
Also Read : ఎన్నికలకు ఇక ఐదు నెలలే.. క్యాబినెట్ లో భారీ మార్పులు