మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాలో సోమవారం నుంచి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. అధినేత రాకతోనైనా కడప జిల్లాలో పార్టీ అంతోఇంతో కోలుకుంటుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జిల్లాల పర్యటనల నేపథ్యంలో ఆయన కడపలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయన మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఇందులో భాగంగా మొదటి రోజైన సోమవారం ఆయన కడప నగరంలోని సాయి శ్రీనివాస కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత రైల్వేకోడూరు, బద్వేలు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కనీసం ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. అయితే పార్టీ అధికారంలో ఉండటంతో నేతలు అధికారాన్ని చెలాయించారు. జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి సైతం దక్కించుకున్నాడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాడు. ఆయన ఓటమిపాలయ్యాడు. అనంతర కాలంలో ఆయన బీజేపీలో చేరాడు. దీంతో జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉండగా వదిలిపెట్టి పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కడప జిల్లాలో మరో కీలకనేత సీఎం రమేష్‌నాయుడు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాష్ర్టస్థాయిలో చక్రం తిప్పాడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన తర్వాత వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యాడు.
టీడీపీ హయాంలో దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీగా గెలుపొందిన బీటెక్ రవి ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. మరో ఎమ్మెల్సీ శివనాథరెడ్డి కూడా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. మరికొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కూడా ఇతర పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారని సమాచారం. దీనికి తోడు మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
అసలే సీఎం సొంత జిల్లా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పెద్దగా బలపడని దుస్థితి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చంద్రబాబు రానున్నారు. చూద్దాం ఆయన ప్రయత్నం ఏ మాత్రం ఫలితాలనిస్తుందో?