iDreamPost
iDreamPost
రాజకీయాల్లో కూడా ఆత్మరక్షణలో పడడం దాదాపు ఓటమితో సమానంగానే చూడాలి. యుద్ధంలోనే కాదు.. నిత్యపోరాటంగా సాగే రాజకీయాల్లో కూడా ఎదురుదాడి చేయడం, ప్రత్యర్థిని ఏమార్చి పై చేయి సాధించడం ఎవరికైనా కీలకం. అలాంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించేవారే పట్టు సాధిస్తారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసినా అది కూడా జనం కోసమే చేశారనే అబిప్రాయం కలిగించాలి. అలా కనిపించాలి. కానీ చంద్రబాబు అక్కడే తప్పు చేసేశారు. మళ్లీ తప్పు సరిదిద్దుకునే అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోతున్నారు. తనతో పాటు టీడీపీని నమ్ముకున్న వారందరినీ ఆయన నట్టేట ముంచేసేలా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో ప్రజలు జగన్ నాయకత్వం మీద ధీమాతో ఉన్నారు. సాధారణ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు, రేపు మునిసిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి అదే రుజువు కాబోతోంది. దానికి ప్రతిపక్షాలు ఎన్ని పేర్లు పెట్టినా ప్రజల్లో జగన్ కి ఆదరణ పెరిగిందన్నది కాదనలేని వాస్తవం. అలాంటి సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా తన పరిధిని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కానీ చంద్రబాబు వేసిన తప్పటడుగుల మూలంగా ఆపార్టీ పూర్తిగా కార్నర్ అయిపోయింది. అధికార పక్షానికి బరి ఇచ్చేసి కళ్లప్పగించి చూడాల్సిన స్థితిలోకి వచ్చేసింది. మళ్లీ టీడీపీ కోలుకుంటుందనే ధీమా సామాన్యుల్లోనే కాదు చివరకు టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో కూడా రానురాను సన్నగిల్లిపోవడానికి చంద్రబాబు కారకులవుతున్నారు.
ఇప్పటికే పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని నినదిస్తున్నారు. నేరుగా చంద్రబాబు ముందే తమ డిమాండ్ ప్రస్తావిస్తున్నారు. అందుకు కారణం చంద్రబాబు ఆత్మహత్యా సదృశ్యం లాంటి నిర్ణయాలు తీసుకోవడమే. ఉదాహరణకు కుప్ప పర్యటనను చూడవచ్చు. వైఎస్సార్సీపీ అక్కడి పంచాయితీ ఎన్నికల్లో పట్టు సాధించింది. నిజంగా అది చంద్రబాబుకి షాక్. అయినప్పటికీ దానిని జనంలోకి వెళ్లకుండా రాజకీయంగా ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ హుటాహుటీన ఆయన కుప్పం పర్యటనకు వెళ్లిపోయారు. ఫలితాలు వచ్చి వారం తిరగకముందే అక్కడ వాలిపోయారు.
తన పునాదులు కూలిపోతుంటే కాపాడుకోవడానికి వెళ్లిపోయారని అంతా అనుకునేలా వ్యవహరించారు గతంలో ఎన్నడూ లేనట్టుగా మూడు రోజులు పర్యటించారు. మళ్లీ మూడు నెలలకు ఓ సారి వచ్చేస్తానని చెప్పుకోవచ్చారు. అంటే నిజంగానే కుప్పంలో చంద్రబాబుకి చెక్ పెట్టేశామని పాలకపక్ష నేతలు చెబుతున్న వాదన వాస్తవమేనని చంద్రబాబు అంగీకరించేశారు తద్వారా తన సీటులోనే తనకు గ్యారంటీ లేదని చెప్పేస్తున్నారు. పూర్తిగా డిఫెన్సులో పడిపోయి పార్టీని దిగజార్చేస్తున్నారనే అభిప్రాయం చాలామంది నేతల్లో బలపడుతోంది.
చంద్రబాబు స్వయంగా తన సీటు కోసం వైఎస్సార్సీపీతో తలపడాల్సిన పరిస్థితిలో ఇక తమకు భరోసా కల్పించగలడనే ధీమా రాష్ట్రమంతా పార్టీ నేతల్లో ఎలా వస్తుంది. ఈ సందర్భంగా జగన్ ని ఓసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. నంద్యాల ఎన్నికల్లో జగన్ తాడోపేడో తేల్చుకోవాలని తలపడినా ఘోర పరాజయం పాలయ్యారు. కారణాలు ఎన్నయినా ఉండవచ్చు గానీ జగన్ మాత్రం ఢీలా పడలేదు. ఆ ఫలితాల తర్వాత వెంటనే రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద దృష్టి పెట్టారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత జిల్లాలో సొంత బాబాయ్ ని పోటీలో దింపితే ఓటమి తప్పలేదు. అయినప్పటికీ జగన్ బేజారెత్తిపోలేదు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు ఆచితూచి అడుగులేశారు.
కానీ చంద్రబాబు అలా కనిపించడం లేదు. పంచాయితీ ఎన్నికల్లో పట్టు సడలుతుందని తేలగానే ఆయన తేలిపోతున్నారు. తనకు తేడా వచ్చేసిందని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితిని టీడీపీని గట్టెక్కించేందుకు ఏమాత్రం దోహదపడదు. పైగా దిశానిర్దేశం చేయాల్సిన నేత ఇంతగా దిగాలుపడుతుంటే తమకు దిక్కెవరూ అనే ప్రశ్న క్యాడర్ లో బలపడుతోంది.