ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధానిలో పర్యటించిన ఘటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోడి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, రాజధానిలో వేసిన శిలాఫలకాలను పరిశీలించారు. అయితే చంద్రబాబు పర్యటనను కొందరు రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరైతే రాళ్లు, చెప్పులు చంద్రబాబు కాన్వాయ్ పై విసిరారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ఈ విధంగా మాట్లాడారు. తాను ఇచ్చిన పిలుపుమేరకు రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చారని తానే రాజధాని నిర్మాణంపై పనులు ప్రారంభించి ముందడుగు వేసినా జగన్ ప్రభుత్వం తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లలేదన్నారు. తన స్వార్థంకోసమో, తన పార్టీ కోసం రాజధానిని నిర్మించడం లేదన్నారు. 25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న తనపై దాడి చేశారని, ఎమ్మెల్యేలు ఎంపీలు సమక్షంలోనే తనపై రాళ్లు, చెప్పులతో దాడికి ప్రయత్నించారని, తమపైనే ఇలా దాడి చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కులాలకు, మతాలకు అతీతంగా తాను రాజధానిని అభివృద్ధి చేస్తే తనకు కులాలు మతాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంనుంచైనా అమరావతికి సరైన దూరంలో ఉంటుందని, తిరుపతి, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని చాలామంది అడిగినా అందరి సౌలభ్యం కోసం అమరావతిలో పెట్టామన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇచ్చిన స్టేట్ మెంట్ ను చంద్రబాబు ప్రస్తావించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల కోసం భూములు లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కంటే అమరావతి లో నివసించే వాళ్లకు ఎక్కువ హక్కులు ఉంటాయని చెప్పారు. నిజంగా తనకు సామాజిక వర్గం పై ప్రేమ అంటే అసలు హైదరాబాద్ ని కట్టే వాడిని కాదన్నారు. ఉన్నతమైన ఆశయాల కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలపాటు ఏం చేశారని ప్రశ్నించారు. రాజధాని మునిగి పోతుంది అంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన సింగపూర్ లో ఎటువంటి అవినీతి లేకుండా ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాంటి దేశం తో మాట్లాడి అమరావతి నిర్మాణానికి సహకారం కోరానన్నారు. అలాంటి నాయకుడు సింగపూర్ వంటి దేశాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నారు.
తాను బ్రతికి ఉండగా పులివెందుల పంచాయతీలు అమరావతిలో జరగనివ్వం అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలోని ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు రాజధాని గురించి ఆలోచించాలన్నారు. జగన్ తో వ్యక్తిగతంగా పోరాటం చేసే అవసరం తనకు లేదని ఐదు కోట్ల మంది ప్రజలకోసం, భావితరాల కోసం తాను పోరాడుతున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం అని వితండవాదం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించొద్దని హెచ్చరిస్తున్నారు. జగన్ పెంచిన రూ.250 పెన్షన్ కూడా చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అందరినీ మోసం చేసిన జగన్ ఇప్పుడు కూడా అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తాను అది చేస్తా.. ఇది చేస్తా.. అని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.