iDreamPost
iDreamPost
అయిపోయిన పెళ్లికి బ్యాండుమేళం అన్నట్టుంది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు. ఏడాది క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని ఆయన ఇప్పుడు తీరుబడిగా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన సర్పంచ్‌ల అవగాహన సదస్సులో బాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో చాలా అరాచకాలు జరిగాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొద్దని వైఎస్సార్ సీపీ హుకుం జారీ చేసిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని చంద్రబాబు ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికలు జరిగిన ఏడాది కాగా అరాచకాలు జరిగిపోయాయని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగి, పాలకులు కొలువుదీరిన ఇన్నాళ్లకు అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొద్దని వైఎస్సార్ సీపీ హుకుం జారీ చేసిందని, ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆరోపణలు చేస్తున్న బాబు ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు మనసులోనే పెట్టుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ప్రశ్నించకపోవడానికి కారణం ఏమిటి? అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై విరుచుకుపడే చంద్రబాబు ఈ విషయంలో ఏ రచ్చా చేయకుండా ఇప్పుడు సర్పంచ్‌ల అవగాహన సదస్సులో విమర్శలు చేయడం అంటే బురదజల్లడం కాక మరేమిటి? అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏ ప్రజా ఉపయోగ కార్యక్రమం చేపట్టినా కోర్టులకు వెళ్లి అడ్డుకొనే చంద్రబాబు అండ్ కో ఇంత ముఖ్యమైన విషయంలో ఏడాదిపాటు ఎందుకు మౌనంగా ఉంది అని అడుగుతున్నారు.
గడువు ముగిసినా మీరెందుకు ఎన్నికలు నిర్వహించలేదు?
టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించగా వారిని ఉత్సవ విగ్రహాలుగా వైఎస్సార్ సీపీ మార్చిందని చంద్రబాబు ఆరోపించడం మరీ విచిత్రం. ఆయన హయాంలో పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసినా స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగిస్తూ కాలక్షేపం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని చూసి భయపడే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోబట్టే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించాల్సి వచ్చింది. రాజ్యాంగ ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నిర్వహించవలసిన ఎన్నికలను నిర్వహించకుండా గ్రామ స్వరాజ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు సర్పంచ్‌లు,, రాజ్యాంగ హక్కులు అని మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉందని అధికార పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై క్రమం తప్పకుండా అసంబద్ధ ఆరోపణలు గుప్పించడం తప్ప వేరే పనిలేని చంద్రబాబు తీరును జనం ఈసడించుకుంటున్నారన్న సంగతి గమనిస్తే ఆయనకే మంచిదని సూచిస్తున్నారు.
Also Read : వారు సంతోషం.. సోమిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట!