iDreamPost
iDreamPost
మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ కీలక పరిణామంగా మారుతోంది. టీడీపీ శిబిరంలోనూ చర్చనీయాంశం అవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో బొల్లినేని గాంధీపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. అయన్ని విధుల నుంచి తొలగించారు. దాంతో పాటుగా హైదరాబాద్ కి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 5 కోట్లు లంచం తీసుకుంటూ గాంధీ పట్టుబడ్డారు. దాంతో 2019లో నమోదయిన అక్రమాస్తుల కేసు, 2020లో నమోదయిన ఆరోపణల నేపథ్యంలో తాజా చర్య ఆసక్తిగా మారుతోంది.
బొల్లినేని గాంధీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన్ని విధుల నుంచి తొలగించారు. సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 1992లో ఇన్ స్పెక్టర్ గా విధులలో చేరిన ఆయన ఆ తర్వాత 2002లో సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయ్యారు. 2004లో ఈడీకి డిప్యూటేషన్ పై వెళ్లిన గాంధీ దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడే విధులు నిర్వహించడం విశేషం. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ, ఆయన లాబీయింగ్ ఫలితమే ఇదేనని కొందరి వాదన.
దీర్ఘకాలం పాటు బొల్లినేని గాంధీ ఒకే చోట విధులు నిర్వహించడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతిఫలంగా గాంధీకి ఇలాంటి అవకాశం వచ్చి ఉంటుందని సందేహిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు లక్షాల పూర్తికి అనుగుణంగా బొల్లినేని గాంధీ వ్యవహరించారు. కూలింగ్ పిరియడ్ ని సైతం తోసిపుచ్చి ఈడీలో పాగా వేసిన బొల్లినేని గాంధీ చివరకు సుజనా చౌదరి మీద జీఎస్టీ ఎగువేత కేసులో గాంధీ పాత్ర ఉందనే విమర్శలున్నాయి
కొంతకాలంగా బొల్లినేని గాంధీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం ఉంది. కేసు నమోదయిన తర్వాత ఇన్నాళ్లుగా వేచి చూసిన సీబీఐ ఇప్పుడు అనూహ్యంగా ఆయన్ని అరెస్ట్ చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని మలుపులు ఖాయమని, గాంధీ విచారణలో అనేక అంశాలు వెలుగు చూస్తాయని కూడా భావిస్తున్నారు.