iDreamPost
android-app
ios-app

నారా లోకేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

నారా లోకేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ 19 నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు,నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చేసి పలువురి ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించినందుకు ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నారా లోకేష్‌పై కేసు నమోదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్ ట్రాక్టర్ డ్రైవింగుపై, ఆకివీడు ప్రాంతంలో ఉన్న రోడ్లపై అవగాహన లేకున్నా కొందరిని ట్రాక్టర్ పై ఎక్కించుకుని నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ చేయడం వల్ల ట్రాక్టర్ ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా టీడీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి గుంపులుగా కార్యక్రమాలను నిర్వహించిన కారణంగా ఆకివీడు పోలీసులు నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది..?

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు నారా లోకేష్ టీడీపీ నేతలైన నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి వెళ్లారు.
ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో వర్షాల కారణంగా ముంపునకు గురైన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లే క్రమంలో నారా లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడపడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయనతో పాటు ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో పాటు టీడీపీ కార్యకర్తలు అనుచరులు ఆందోళనకు గురయ్యారు.

కాగా లోకేష్‌తోపాటు ఉన్న ఎమ్మెల్యే మంతెన రామరాజు చాకచక్యంగా వ్యవహరించి ట్రాక్టర్‌ను అదుపు చేయడంతోపాటు పెను ప్రమాదం తప్పింది. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం వేరే ట్రాక్టర్ తెప్పించి ఆ ట్రాక్టర్ పై నారా లోకేష్ మిగిలిన పర్యటన కొనసాగించారు. నారా లోకేష్‌తోపాటు పార్టీ నేతలకు పెను ప్రమాదం తప్పడంతో అనుచరులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.