iDreamPost
android-app
ios-app

కడప శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడప శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప-తాడిపత్రి మధ్య గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ను స్కార్పియో మరియు కారు ఢీకొనడంతో నలుగురు సజీవదహనం కాగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలపాలయ్యారు.

వివరాల్లోకి వెళితే కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద కడప నుంచి అనంతపురం వైపు అక్రమంగా ఎర్రచందనం దుంగలు తీసుకెళ్తున్న స్కార్పియో విమనాశ్రయం సమీపానికి రాగానే మలుపు తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. స్కార్పియో టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ ని బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దాంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయలవడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వాళ్ళందరూ కలిసి స్కార్పియో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్దారించారు.

కాగా ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఎర్రచందనం దుంగలు సహా మ మూడు వాహనాలు ఈ ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. టిప్పర్ ను ఢీకొన్న కార్ కూడా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న వారిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.