Idream media
Idream media
రెండో సారి మేయర్ పీఠం కోసం టీఆర్‌ఎస్.. బల్దియాలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు బీజేపీ.. మధ్య హోరాహోరీగా సాగుతున్న గ్రేటర్ పోరు గెలిచే అభ్యర్థులకే కాదు.. వెనుక ఉండి నడిపించే నాయకులకూ ప్రతిష్టాత్మకమే. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డిలో సాధించే సీట్లపైనే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలకు పార్టీలో గుర్తింపు లభించనుంది. జనవరిలో జరిగిన శివారు మున్సిపల్ ఎన్నికల్లో బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్‌లలో టీఆర్‌ఎస్ అరకొర స్థానాలు సాధించింది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించుకోవడం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చాలా అవసరం. అలాగే మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఇటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నాడు టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్.. బీజేపీకి ఒక్కటే..
గ్రేటర్ పరిధి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 64 డివిజన్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. శేరిలింగంపల్లిలో 10, ఉప్పల్‌లో 10, కూకట్‌పల్లిలో 9, మల్కాజిగిరిలో 9, కుత్బుల్లాపూర్‌లో 8, రాజేంద్రనగర్‌లో 5, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో 2 డివిజన్లు ఉన్నాయి. 2016లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం డివిజన్లలో 62 చోట్ల టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీకి ఒకటి మాత్రమే దక్కింది. కాంగ్రెస్ ఓ డివిజన్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ డివిజన్లలో సగం సొంతం చేసుకునేందుకు బీజేపీ గురి పెట్టింది. గతంలో కేవలం ఆర్కేపురం డివిజన్‌లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇపుడు శివార్లలో అనేక చోట్ల అధికార పార్టీతో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీపడుతోంది. ఇదిలా ఉండగా.. గతంలో సాధించిన సీట్లను నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆ మంత్రులకు సవాల్‌గా మారింది. ఈ ఎన్నికలను సీఎం కేసీఆర్ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఎల్బీస్టేడియంలో జరిగిన సభ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ మాత్రం సీట్లు తగ్గినా ఆ ప్రాంతంలోని నాయకుల రాజకీయ భవితవ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అందరూ ఇజ్జత్ కా సవాల్‌గా పని చేస్తున్నారు.
రేవంత్ కృషి ఫలించేనా..?
అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ఆ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాచారం డివిజన్‌లో మాత్రమే విజయం సాఽధించగా ఈసారి సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో రేవంత్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ దృష్టిసారించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా సాధించిన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రేవంత్‌రెడ్డికి కూడా ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఇక గత ఎన్నికల్లో కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రమే విజయం సాఽధించిన టీడీపీ ఈసారి ఆ సంఖ్యను పెంచుకుంటుందా..? కనీసం ఒక స్థానమైనా సాధిస్తుందా అనేది వేచి చూడాలి.