iDreamPost
android-app
ios-app

కొడాలి నానికి ధీటైన నాయకుడే దొరకడం లేదా?

కొడాలి  నానికి ధీటైన నాయకుడే దొరకడం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తాన్ని అనేక మార్పులు చేర్పులకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా కొనియాడబడిన ఎన్టీరామారావు ఆ నియోజకవర్గం నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన స్వగ్రామం నిమ్మకూరు కూడా ఈ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. అలా ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం ఒక పెట్టని కోటగా భాసిల్లుతూ వచ్చింది.

ఎన్టీఆర్ 1983లో పోటీ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది సార్లు ఇక్కడి నుంచి టీడీపీ తరఫున అభ్యర్థులుగా నిలబడిన వారు అందరూ గెలిచారు. ఎన్టీఆర్ పోటీ చేయడం మానేసిన తర్వాత రావి కుటుంబం ఇక్కడి నుంచి టిడిపి ప్రతినిధులుగా ఉంటూ వచ్చింది. రావి శోభనాద్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేయగా ఆయన కుమారులు రావి హర గోపాల్, రావి వెంకటేశ్వర రావు సైతం ఎమ్మెల్యేగా గెలిచారు.

Also Read:టీవీ9 దేవి నాగవల్లి… దాసరికి ఏమవుతుంది…?

1999లొ రావి హర గోపాల్ పోటీ చేసి గెలిచాడు కాని ప్రమాణ స్వీకారం చేయకముందే చని పోయాడు. ఉప ఎన్నికలలో హరగోపాల్ తమ్ముడు శివరామ క్రిష్ణను పోటీ చేయించాలనుకున్నారు.కాని అతను కూడ రైల్వే క్రాసింగ్ దగ్గర కార్ ను రైలు ఢీ కొనటంతో చనిపోయారు.రావి శోభనాద్రి వైరాగ్యంతో రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటే చంద్రబాబు ఆయన్ను ఒప్పించి ఆయన చిన్న కొడుకు వెంకటేశ్వర రావ్ ను 2000లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేయించి గెలిపించారు. రాజకీయ చరిత్ర, ఇద్దరు కొడుకులు చనిపోయిన సానుభూతిని దాటుకొని కొడాలి నాని 2004 లో టికెట్ సాధించి గెలిచారు. గుడివాడ చరిత్రలో హాట్రిక్ విజయాలు సాధించిన ఏకైక నాయకుడు కొడాలి నాని ,2004 నుంచి 2019 మొత్తం నాలుగు ఎన్నికల్లో గెలిచారు. రావి వెంకటేశ్వర రావ్ 2009లో ప్రజారాజ్యం,2014లో టీడీపీ తరుపున పోటీచేసినా నానిని ఓడించలేక పొయ్యాడు.

టీడీపీకి ఇప్పుడు గుడివాడలో ధీటైన నాయకుడు దొరకడమే కష్టంగా మారిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కొడాలి నాని ఆ తర్వాతి పరిణామాలతో వైసీపీ అధినేత జగన్ కు చేరువ కావడం జగన్ కి నమ్మకస్తులైన అతికొద్ది మంది నాయకులలో ఒకరిగా ఎదగడం అందరికీ తెలిసిందే. ఇక టిడిపి అంటే గుడివాడ, గుడివాడ అంటే టిడిపి అనేలా ఉండే పరిస్థితిని గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనేట్లుగా ఆయన చేసుకోగలిగారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయింది అంటే కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీలో ఉన్న కీలక నేతలందరినీ టార్గెట్ చేసి ఎవరూ చేయని విధంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు సరే నాని మీద సరైన రీతిలో కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి గుడివాడ టిడిపిలో నెలకొంది.

Also Read:సలహాదారుగా రజనీష్.. ఓ మంచి ఎంపిక..!

ఒకరకంగా అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ గుడివాడలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కాబట్టే కొడాలి నానికి జనం అండగా ఉంటున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఎప్పటికప్పుడు ఎన్నికల సమయానికి దీటైన నాయకుడు ఎవరు దొరుకుతారా అని వెతికి ఏ పరిస్థితిలో ఉంది. అందులో భాగంగానే గుడివాడ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ని తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేయించింది. ఎలాగైనా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టడంతో ఆయన కూడా బాగానే ఖర్చు చేశారు. కానీ కొడాలి నాని క్రేజ్ అలాగే జగన్ వేవ్ ముందు ఏ మాత్రం నిలబడలేకపోయారు. నిజానికి ఆ సమయంలో రావి వెంకటేశ్వరరావు వర్గం తొలుత ఈ నిర్ణయానికి ఎదురుతిరిగింది. బయట వ్యక్తులను తీసుకువచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే తాము మద్దతు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినా చంద్రబాబు బుజ్జగించి ఎలాగో అవినాష్ ని పోటీ చేయించారు. తీరా అలా చేయడంతో మొదటికే మోసం వచ్చింది, తరువాతి పరిణామాల్లో అవినాష్ సైతం జగన్ నాయకత్వానికి జైకొట్టారు.

ఇక ప్రస్తుతం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా రావి వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. కానీ ఆయన కేవలం ప్రెస్ మీట్ లకు మాత్రమే పరిమితం అవుతున్నారు అని అంటున్నారు లోకల్ క్యాడర్. ఒకప్పుడు ఎన్టీఆర్ పోటీ చేసిన నియోజకవర్గం నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకుడు దొరకకపోవడం అనే విషయం వాళ్ళందరిలో ఒక అభద్రతా భావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పకతప్పదు. ఎందుకంటే నాయకుడు బలంగా ఉన్నప్పుడే కార్యకర్తలు కూడా ధైర్యంగా బరిలోకి దిగి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ నాయకుడే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ సైలెంట్ గా ఉండి పోతూ ఉండడంతో ఇప్పుడు కొడాలి నాని హవా, వైసీపీ జెండా గుడివాడలో ఎగురుతోంది.

Also Read:మంత్రిగా పని చేశారు కదా..? ఆ మాత్రం తెలియదా కాల్వ శ్రీనివాస్ గారు

ఇప్పుడు గుడివాడ మొత్తం మీద చూసుకున్నా ఆయనకు ధీటైన నాయకుడిని తీసుకువచ్చి నిలబెట్టి చూపడం అనేది చాలా కష్టమైన అంశమే. బయట నుంచి నేతలను తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టినా లోకల్ క్యాడర్ ఏమేరకు సహకరిస్తారు అనేది కూడా సందేహమే. సో గుడివాడలో టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అంటే చంద్రబాబు, లోకేష్ లలో ఎవరో ఒకరు స్వయంగా వచ్చి నిలబడి అద్భుతం చేస్తే తప్ప వేరే దారులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.