iDreamPost
android-app
ios-app

‘800’ వివాదాలను తట్టుకుని రాగలదా

  • Published Oct 15, 2020 | 12:04 PM Updated Updated Oct 15, 2020 | 12:04 PM
‘800’  వివాదాలను తట్టుకుని రాగలదా

విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా రూపొందబోయే 800 సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి తమిళ సోషల్ మీడియా జనాలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. శ్రీలంక జెండా ఉన్న జెర్సి వేసుకుని అక్కడి క్రీడాకారుడి గొప్పదనాన్ని కీర్తిస్తూ నడిచే సినిమాలో ఎలా నటిస్తావని విజయ్ ని టార్గెట్ చేస్తూ దీన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున పిలుపు ఇస్తున్నారు. దశాబ్దాలుగా శ్రీలంకలో తమిళ ప్రజలు పడుతున్న బాధలు, ఎదురుకున్న హింసను మర్చిపోయి ఇలా చేయడం ఏమిటని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈలం టైగర్స్ కు మద్దతుగా మురళీధరన్ ఏనాడూ మాట్లాడలేదని వంశ మూలాల పరంగా అతను తమిళనాడుకే చెందినవాడు అయినప్పటికీ అతని ఉద్దేశాలు గతంలోనే బయటపడ్డాయని గట్టిగా విమర్శిస్తున్నారు. దెబ్బకు నిర్మాతలు జడుసుకుని పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు ఉండవని పైపెచ్చు తమిళుల గొప్పదనం వివరించే సంఘటనలు సన్నివేశాలు ఉంటాయని వివరణ ఇచ్చుకున్నారు. అంతే కాకుండా సినిమాకు పనిచేసే టీమ్ లో శ్రీలంకలో నివసించే తమిళులు కూడా భాగం కాబోతున్నారని ప్రపంచానికి పరిచయం కాబోయే వాళ్ళ టాలెంట్ ను అడ్డుకోవద్దని అభ్యర్థించారు.

ఇంకా మొదలుకాకుండా ఇంతటి వివాదంలో చిక్కుకోవడం 800 మేకర్స్ ని ఇబ్బంది పెడుతోంది. ట్విట్టర్ లో షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అనే ట్యాగ్ ట్రెండింగ్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని వదిలేసుకుంటే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ గా ఉన్న మురళీధరన్ ఈ సినిమా అఫీషియల్ లాంచ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొత్తానిక ఇది తీయడం విడుదల చేయడం అంత ఈజీగా కనిపించడం లేదు. కాకపోతే ఈ నిరసన సెగలు తమిళనాడుకే పరిమితం. మిగిలిన రాష్ట్రాల ప్రేక్షకులకు శ్రీలంక తమిళ వివాదం మీద అవగాహన తక్కువే