iDreamPost
iDreamPost
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఏటా ఆసక్తిగా ఉంటుంది. వివిధ ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని అది చాటుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు హయంలో కాగ్ నివేదికలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా చిత్రీకరించిన పచ్చ మీడియా ఇప్పుడు మాత్రం ఆర్థిక విధ్వంసం, ఆర్థిక అస్తవ్యస్తం అన్నట్టుగా కథనాలు వండి వార్చే ప్రయత్నాలు మాత్రం చేశాయి. కానీ అసలు వాస్తవాన్ని మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం గుర్తించాల్సిన అంశం.
ఆంద్రప్రదేశ్ కి విభజన నాటికే ఉన్న అప్పులకు తోడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల భారం తడిసి మోపెడయ్యింది. వాటికి వడ్డీల భారమే ఏటా రూ. 20వేల కోట్లు దాటింది. వాటికి తోడుగా చంద్రబాబు పాలనలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులను జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. వాటి విలువ మొత్తం రూ. 60వేల కోట్లు అని ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంటే అప్పులు వాటి వడ్డీల భారానికి తోడుగా పాత బిల్లుల చెల్లింపు కూడా ఏపీ ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. అందుకు అదనంగా కేంద్రం కూడా కేటాయించాల్సిన నిధులలో కోత పెట్టింది. కరోనా లో పూర్తిగా నిలిపివేయగా, దానికి ముందే 2019 నుంచి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయింది.
ఆదాయం లేకపోగా, అప్పులు పెరిగిపోగా, కేంద్రం చేయూత కూడా ఇవ్వడం లేదనే వాస్తవాన్ని పచ్చ మీడియా కప్పిపుచ్చడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటాగా రూ. 32,787 కోట్లు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయి. అంటే అప్పట్లో చంద్రబాబు సర్కారుకి కేంద్రం నుంచి వాటాగా రావాల్సిన పన్నులు వచ్చినప్పటికీ బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన విషయం స్పష్టమవుతోంది. కానీ ఏడాది గడిసేసరికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా పెరగాల్సి ఉండగా దానికి భిన్నంగా జరిగింది. కాగ్ రిపోర్టులోనే పేర్కొన్న లెక్కల ప్రకారం కేవలం రూ 28,242 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సుమారుగా నాలుగున్నర వేల కోట్లు ఏపీ ఆదాయానికి కేంద్రం గండికొట్టింది.
ఓవైపు పెరిగిన ఖర్చులు, మరోవైపు పెండింగ్ బిల్లులకు తోడుగా కేంద్రం పన్నుల వాటాలో కోత మూలంగా ఏపీలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చి నెపాన్ని జగన్ ప్రభుత్వం మీద నెట్టేందుకు ఆ వర్గపు మీడియా ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా అని, ప్యాకేజీ అని నానా యాగీ చేసిన చంద్రబాబు వాటిని సాధించకపోగా రాష్ట్రాన్ని అవస్థల పాలుజేసిన సంగతిని ప్రజలంతా గుర్తించారు. ఇప్పుడు కేంద్రం తన హామీలు నెరవేర్చకపోగా ఏపీకి మరింత టోకరా పెట్టేలా నిధుల్లో కోత పెట్టడం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం అనేది అర్థమవుతోంది. అలాంటప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించకుండా దాచిపెడుతున్న పచ్చమీడియా వైఖరి ఏపీకి ద్రోహం చేస్తున్న వారికి తోడుగా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందనేది పలువురి అభిప్రాయం.
Also Read : CBI, Retired HC Judge, SN Shukla – ముడుపుల భాగోతం.. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిపై సీబీఐ విచారణ