iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిచ్చేలా కనిపిస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న జగన్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకెళుతోంది. కేంద్రం నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. తాజాగా దేశంలో మొత్తం మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటునకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఏపీలో కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ కి కొత్త శోభ ఖాయంగా మారింది. దక్షిణాంధ్రలోని తీర ప్రాంతం ఇప్పుడు ఇండస్ట్రీయల్ హబ్ గా రూపొందే అవకాశం ఏర్పడుతోంది.
దేశంలోమూడు పారిశ్రామిక కారిడార్లను రూ. 7,725 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దానికి అనుగుణంగా రూ. 2139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ సిద్ధం కాబోతోంది. తద్వారా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతోపాటు తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ కారణంగా లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడంతోపాటు నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.
ఇప్పటికే కృష్ణపట్నం సమీపంలో రామయాపట్నం పోర్టు నిర్మాణానికి కూడా ఏపీ ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. దాంతో అటు నెల్లూరు, ఇటు ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. పలు పరిశ్రమల ఏర్పాటు కోసం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో వివిధ సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. దాంతో పలు ప్రతిపాదనలు పట్టాలెక్కుతాయనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక కృష్ణపట్నంతో పాటుగా నక్కపల్లి – మచిలీపట్నం – అనంతపురం – కర్నూలు పారిశ్రామిక కారిడార్ల ప్రతిపాదనలు కేంద్రం ముందు సిద్దంగా ఉన్నాయి., వాటికి కూడా అనుమతులు వస్తే ఇక ఏపీలో పారిశ్రామిక కారిడర్లు కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా చెప్పవచ్చు.