iDreamPost
android-app
ios-app

బాబుని బజారున పడేసిన బుచ్చయ్య

  • Published Aug 20, 2021 | 3:14 AM Updated Updated Aug 20, 2021 | 3:14 AM
బాబుని బజారున పడేసిన బుచ్చయ్య

అసలే టీడీపీ అంతంతమాత్రంగా ఉంది. అధినేత పిలుపులను కూడా చాలామంది నేతలు ఖాతరు చేయడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కనుసైగలతోనే సర్వం జరిగిపోయేది. ఇప్పుడు ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేకపోవడం కలవరపెడుతోంది. అలాంటి సమయలో మూలిగే బాబుపై బుచ్చయ్య బాంబు వేసినట్టే భావించాలి. రాజీనామా బెదిరింపులు, ఆ తర్వాత రాయబారాలు, చివరకు ఏబీఎన్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుని బజారున పడేశాయి. బాబు బండారం అందరికీ చాటిచెప్పినట్టయ్యింది. ఇదంతా ఓ లక్ష్యంతో సాగినట్టు అంతా భావిస్తున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీ వెంట నడిచిన బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి అసలు కారణం గోదావరి గట్టు మీద ఆదిరెడ్డి అప్పారావుతో ఉన్న తగాదాలని అంతా ప్రచారం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ కుటుంబం తీరుతో అసహనానికి గురయ్యారని పైకి ప్రకటించారు. కానీ అసలు గుట్టు వేరుగా ఉందని బుచ్చయ్య మాటలను బట్టి తెలుస్తోంది. ఏపీ టీడీపీలో తీవ్రస్థాయిలో అంతర్మథనం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కమ్మ కులానికి వ్యతిరేకంగా ఓ బలమైన అభిప్రాయం ఏర్పడడం టీడీపీ ఓటమికి కీలక కారణమని అంతా భావిస్తున్నారు. చివరకు చంద్రబాబు కూడా సొంత కులస్తులకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే తనపార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని, కొందరు చేసిన అతి మూలంగా అందరికీ అనర్థం జరిగిందనే అంచనాకు వచ్చారు.

దానికి తగ్గట్టుగా ఇటీవల పలు మార్పులు చేస్తున్నారు. మళ్లీ ఇతరులను ఆకట్టుకునేలా కనిపించడానికి ఆదుర్ధా పడుతున్నారు. ఆ క్రమంలోనే పలు సందర్భాల్లో నాన్ కమ్మకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ఇటీవల పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాల్లో ఇది ప్రస్ఫుటమవుతోంది. టీడీపీ నిర్ణయాల్లోనూ అది కనిపిస్తోంది. చివరకు ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే చంద్రబాబు కూడా అమరావతి ఉద్యమానికి ప్రత్యక్షంగా అండగా నిలవలేని పరిస్థితి వచ్చింది. మీడియాతో మాట్లాడడం, అప్పుడప్పుడూ నారా లోకేష్ అక్కడ కనిపించడం మినహా చంద్రబాబు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమ ప్రారంభం, ప్రస్థానం అంతా చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతున్నప్పటికీ ఆయన పాత్ర ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read : పోలవరం పూర్తిపై బుచ్చయ్య చేసిన రాజీనామా సవాళ్లు తెలుసా..?

కమ్మ కులస్తుల్లో అసంతృప్తికి ఇలాంటి అనేక పరిణామాలు దోహదపడుతున్నాయి. వాటన్నింటినీ బుచ్చయ్య తన మాటల్లో చెప్పకనే చెప్పారు. అదే సమయంలో నారా లోకేష్ తీరు మీద కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. పార్టీలో ఎన్టీఆర్ అభిమానులను తక్కువ చేస్తూ తన అనుకూల వర్గంతో నింపేయాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నట్టు కనిపిస్తోంది. దానిని సహించలేని బుచ్చయ్య అండ్ కో అభిప్రాయం ఈ ఆవేశం వెనుక ఉందనే చెప్పవచ్చు. ఓవైపు లోకేష్ తీరు, మరోవైపు అనేక కారణాల మూలంగా కమ్మ కులస్తులకు తగ్గుతున్న ప్రాధాన్యత కారణంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని ఆయన చాటుతున్నట్టు చెబుతున్నారు. పార్టీ లేదూ బొక్కా లేదు అంటూ వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు వంటి వారికి దక్కుతున్న ప్రాధాన్యత తనకు లేదని బుచ్చయ్య ఆవేదన. అదే సమయంలో యనమలకు ప్రత్యేక స్థానం ఇచ్చి తన వంటి వారిని ఖాతరు చేయడం లేదనే అభిప్రాయం కూడా చాలాకాలంగా ఉంది. ఇవన్నీ కలిసి బుచ్చయ్య బరస్ట్ కావడానికి కారణమయ్యాయి.

ఇక ఏబీఎన్ రాధాకృష్ణ కూడా బుచ్చయ్యతో ప్రత్యేకంగా మాట్లాడించడం వెనుక కమ్మ ప్రయోజనాలున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కూడా తనకు ప్రాధాన్యత లేదని, తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని అంటూనే లోకేష్ కార్పోరేట్ తరహా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే పార్టీకి బీసీలు, మైనార్టీ, ఎస్సీ వర్గాలు దూరమయ్యాయయని బుచ్చయ్య బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అదే సమయంలో కమ్మ కులస్తులు టీడీపీ మూలంగానే నష్టపోయారని వాపోయారు. తమకేమీ దక్కలేదని చెప్పిన మాటల వెనుక ఆర్కే వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఏమయినా బుచ్చయ్య వ్యవహారం టీడీపీ టీకప్పులో తుఫాన్లు తీసుకుంది. కానీ దాని పర్యవసానాలు, ప్రభావాలు పెద్ద స్థాయిలోనే ఉంటాయని చెప్పవచ్చు. బాబు పథక రచనకు ఇది పెద్ద బ్రేక్ అవుతుందనే అంచనా పెరుగుతోంది.

Also Read : బుచ్చయ్య పయనమెటు, టీడీపీలో మిగిలేదెందరు