iDreamPost
android-app
ios-app

బన్నీ శీనులకే ఎలా సాధ్యమయ్యింది

  • Published Sep 04, 2020 | 5:51 AM Updated Updated Sep 04, 2020 | 5:51 AM
బన్నీ శీనులకే ఎలా సాధ్యమయ్యింది

అదేంటో గాని మన ఊర మసాలా తెలుగు సినిమాల డబ్బింగులు నార్త్ వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాని ఇతర బాషల ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంతగా అంటే ఏకంగా యుట్యూబ్ లో రికార్డులు సృష్టించేంతగా. పోనీ అవేమైనా ఇక్కడ ఇండస్ట్రీ హిట్లా అంటే అదీ కాదు. నిజంగా విచిత్రమే కదూ. అల్లు అర్జున్ సరైనోడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకి నాయక హిందీ వెర్షన్లు రెండూ 300 మిలియన్ల వ్యూస్ సాధించి కనివిని ఎరుగని సరికొత్త రికార్డులు సొంతం చేసుకున్నాయి. రెండింటి దర్శకుడు బోయపాటి శీను కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి ఈ ఘనత సొంతం కాలేదు.

తమిళ, మలయాళం నుంచి ఇంతకన్నా గొప్ప చిత్రాలు డబ్బింగ్ అయినప్పటికీ దేనికీ ఇంత రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం. సరైనోడు ఈ మార్క్ ని రెండేళ్లలో చేరుకోగా జయ జానకి నాయక మాత్రం కేవలం ఏడాది టైం తీసుకోవడం అసలు ట్విస్ట్. బన్నీ సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ బెల్లం హీరో మూవీ అంతగా మనవాళ్లకు ఎక్కలేదు. యావరేజ్ గా మిగిలి టీవీ రేటింగ్స్ లో మాత్రం సూపర్ హిట్ కొట్టింది. ఇవి రానున్న రోజుల్లో తన వ్యూస్ నెంబర్ ఇంతకన్నా ఎక్కువగా పెంచుకుంటాయే తప్ప తగ్గే ప్రసక్తే ఉండకపోవచ్చు అయితే ఇంతగా ఎగబడి వీటిని ఎందుకు చూస్తారన్న అనుమానం రావొచ్చు. వాస్తవానికి బాలీవుడ్ ఇలాంటి మసాలా సినిమాలు రావడం ఎప్పుడో ఆగిపోయింది.

ఒక్క సల్మాన్ ఖాన్ తప్ప ఎవరూ వీటిని ట్రై చేయడం లేదు. అతిశయోక్తితో కూడిన హీరోయిజంని చూపించేందుకు అక్కడి దర్శకులు ఆసక్తి చూపడం లేదు. అది చాలా కాలంగా నార్త్ ఆడియన్స్ లోటుగా ఫీలవుతున్నారు. ఈ ఒక్క కారణంగానే తెలుగు తమిళ కన్నడ డబ్బింగ్ సినిమాలతో సోనీ ఛానల్ ఏళ్ళతరబడి బ్రహ్మాండమైన రేటింగ్స్ తో నెట్టుకొస్తోంది. గోల్డ్ మైన్స్ అనే యుట్యూబ్ ఛానల్ పేరుకి తగ్గట్టు వీటితోనే బంగారు గనులు పోగేసుకుంటోంది. పెన్ మూవీస్, ఆదిత్య లాంటి కంపెనీలు కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. దానికి తగ్గట్టే కనక వర్షం కురుస్తోంది కూడా. ఏది ఎలా ఉన్న ఈ వార్త విన్న అల్లు అర్జున్, సాయి శ్రీనివాస్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో దీన్నో ట్రేండింగ్ టాపిక్ గా మార్చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.