కరోనా సెకండ్ వేవ్ మొదలైన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ తీవ్రతరం కావడంతో ఇప్పటికే కొన్ని యూరప్ దేశాలు తిరిగి లాక్ డౌన్ విధించాయి కూడా. కాగా బ్రిటన్ లో కూడా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. నిన్న ఒక్క రోజులో 21,363 మంది కరోనా బారిన పడగా 213 మంది మృత్యువాత పడ్డారు.
తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన పార్లమెంట్ సభ్యునితో భేటీ కావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా బోరిస్ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి. బోరిస్ జాన్సన్‌కు కరోనా లక్షణాలు ఏమీ లేవని కానీ పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో నవంబర్ 26 వరకూ బోరిస్ జాన్సన్ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని అధికారులు వెల్లడించారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలిసారి కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కాస్త విషమ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కాగా మరోసారి బ్రిటన్ ప్రధాని కోవిడ్ 19 బారిన పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.