బీహార్‌లో కీలక ఉపఎన్నికలకు ముందు ఆర్జేడీతో కాంగ్రెస్ తన రెండు దశాబ్దాల బంధానికి తెగతెంపులు చేసుకుంది. బీహార్‌లోని కుశేశ్వరస్థాన్, తారాపూర్ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.గత అసెంబ్లీ ఎన్నికలలో కుశేశ్వర్‌స్థాన్ నుండి కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ రెండవ స్థానంలో నిలిచింది. అందుకే ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కుశేశ్వరస్థాన్ నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుకుంది.కానీ కుశేశ్వరస్థాన్, తారాపూర్ స్థానాల నుంచి ఆర్జేడీ అభ్యర్థులను బరిలో నిలిపింది.తమతో చర్చించకుండా ఆర్జేడీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్జేడీ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూడా రెండు స్థానాల్లో ఆర్జేడీకి వ్యతిరేకంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ విషయం మీద చాలా రోజుల నుంచి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ మరియు ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య ఉన్నత స్థాయి ఒప్పందం కుదురుతుందని భావించారు.కానీ అది వర్కౌట్ కాలేదు.
తమను తాము నిజమైన ఎన్డీయే వ్యతిరేకి అనిపించుకునేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్రంగా దాడి చేసుకుంటున్నాయి. ఆర్జేడీ పొత్తు నుంచి వైదొలగుతున్నామని బీహార్ కాంగ్రెస్ చీఫ్ భక్త్ చరణ్ దాస్ శుక్రవారం నాడు వెల్లడించారు. తమ పార్టీ స్థానాల్లో ఆర్జేడీ పోటీచేయడమంటే ఇరు పార్టీల మధ్య స్నేహాన్ని అపహాస్యం చేయడమేనని దాస్ పేర్కొన్నారు. కేవలం ఈ ఉప ఎన్నికలే కాక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుందని చరణ్ దాస్ స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని ఆర్జేడీ నేత తేజస్వి విస్మరించారని, అందుకే మా సంప్రదాయ సీటు అయిన కుశేశ్వర్‌స్థాన్ లోనూ ఆర్జేడీ అభ్యర్ధిని నిలిపిందని దాస్ ఆరోపించారు. తాము బీజేపీతో పోరాడుతుంటే ఆర్జేడీ మాత్రం అధికార దాహంతో తన సిద్ధాంతాలతో రాజీపడుతోందని దాస్ ఆరోపించారు. సంవత్సరం క్రితం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కి వ్యతిరేకంగా కలిసి పోరాడిన రెండు పార్టీలు ఉప ఎన్నికల కోసమే విడిపోయాయా? అంటే కాదనే చెప్పాలి. దానికి మరిన్ని కారణాలు సైతం ఉన్నాయి.ఇక కాంగ్రెస్- ఆర్జేడీ పరస్పర యుద్ధంలో, విజయం ఎవరు సాధిస్తారు అనేది ప్రస్తుతానికి చెప్పలేము. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఈ తెగదెంపుల వల్ల లాభపడే అవకాశం కనిపిస్తోంది.
ఆ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన 17 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గతంలో సింఘియాలో ఆరుసార్లు గెలిచింది (ఇది 2010కి ముందు ఉన్న ప్రాంతం. డీలిమిటేషన్ తర్వాత కుశేశ్వర్‌స్థాన్ గా మారింది). ఇక్కడ ఒకసారి మాత్రమే ఆర్జేడీ గెలిచింది. కుశేశ్వరస్థాన్ ఏర్పాటయ్యాక మొదటి ఎన్నికలు 2010లో జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. 2015లో జేడీయూ మహాకూటమిలో భాగమైన క్రమంలో సీటు జేడీయూకు దక్కగా ఆ పార్టీ అక్కడ విజయం సాధించింది. 2020లో కాంగ్రెస్ రెండోసారి పోటీ చేసింది.ఆ పార్టీ అభ్యర్థి ఏడు వేల ఓట్ల తేడాతో జేడీయూ చేతిలో ఓడిపోయింది. అయితే 2010తో పోలిస్తే కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనందుకు కాంగ్రెస్‌ను ఎప్పటి నుంచో శాపనార్థాలు పెడుతోంది.
70 మంది కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలవగా 19 సీట్లు గెలిచింది. 2015లో వచ్చిన సీట్లనే కాంగ్రెస్ గెలుచుకుని ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సులువుగా ఉండేది. కానీ అది అలా జరగలేదు. ఇక కాంగ్రెస్ ఏకంగా ఆర్జేడీ బీజేపీతో కలవబోతోంది అని ఆరోపణలు చేస్తోంది. ఇక ఉప ఎన్నికల తర్వాత బీజేపీతో ఆర్జేడీ పొత్తు పెట్టుకుంటుందన్న కాంగ్రెస్ పెద్ద ఆరోపణలపై ఆర్జేడీ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతోంది. బీహార్ వచ్చిన ముగ్గురు యువనేతలు హార్దిక్ పటేల్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవానీలు మూడు రోజుల పాటు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు. కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ప్రశంసించలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన తన కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ యొక్క యువ నాయకుడి ఇమేజ్‌ను కన్హయ్య దెబ్బతీశారని లాలూ భావిస్తున్నారు. తెగదెంపులు అయ్యేందుకు ఇది కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నారు.
Also Read : TDP Merger – బీజేపీలో తెదేపా విలీనానికి ప్రతిపాదనలా?