Idream media
Idream media
సద్దుమణిగిందనుకున్న మద్విరాట్ శ్రీ పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి వారి మఠం పీఠాధిపతి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. పీఠాధిపతిగా ఎవరు ఉండాలనే అంశంపై వారసుల మధ్య నెలకొన్న వివాదం.. నాలుగు రోజుల కిందట దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరి సమసిపోయింది. అయితే పీఠాధిపతి ఎంపిక పూర్తయిందనుకున్న తరుణంలో మారుతీ మహాలక్షమ్మ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదలైంది.
ఇటీవల పరమపదించిన పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి స్థానంలో నూతన పీఠాధిపతి ఎంపిక జరగాల్సి ఉండగా.. పీఠాధిపతి ఎవరుండాలనే అంశంపై ఆయన రాసిన వీలునామాతో వివాదం చెలరేగింది. వేంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చంద్రావతికి 8 మంది సంతానం. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి మరణించిన తర్వాత వేంకటేశ్వరస్వామి మారుతీ మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు 13, 10 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యుల్లో పెద్దవారు పీఠాధిపతి కావాలి.
అయితే చంద్రావతి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు కిడ్నీ దానం చేసిన వారికి పిఠాధిపతి పదవి దక్కేలా వేంకటేశ్వరస్వామి వీలునామా రాశారు. రెండో కుమారుడు వీరభద్రయ్య కిడ్నీ దానం చేశారు. వీరభద్రయ్య తర్వాత రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అయ్యేలా వీలునామలో పేర్కొన్నారు.
వేంకటేశ్వరస్వామి తర్వాత పీఠాధిపతిగా ఎవరు ఉండాలనే అంశంపై కందిమల్లాయపల్లి గ్రామస్తులు కొంత మంది వేంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి, మరికొంత మంది తల్లికి కిడ్నీ దానం చేసిన రెండో కుమారుడు వీరభద్రయ్యకు మద్ధతుగా నిలబడ్డారు. వీలునామా ప్రకారం పీఠాధిపతిగా తన కుమారుడుకు కూడా అవకాశం ఉందని, అయితే వారు చిన్నపిల్లలు కావడం వల్ల అప్పటి వరకు తాను పీఠాధిపతిగా ఉంటానంటూ మారుతీ మహాలక్ష్మమ్మ పట్టుబట్టారు. పలు దఫాలు చర్చల తర్వాత.. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా, రెండో కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎన్నుకున్నారు. వెంకటాద్రి స్వామి తర్వాత వీరభద్రయ్య పీఠాధిపతిగా ఉంటారు. ఆయన తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అవుతారు. అప్పటి వరకు మారుతీ మహాలక్ష్మమ్మకు భృతిగా ప్రతి నెలా కొంత మొత్తం నగదు పీఠాధిపతి చెల్లించేలా అవగాహన ఒప్పదం కుదిరింది. వారి యోగ క్షేమాలు కూడా పీఠాధిపతియే చూసేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. మంచి ముహూర్తాన వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు.
పెద్దల సమక్షంలో రాజీకి వచ్చిన మారుతీ మహాలక్ష్మమ్మ.. ఆ రోజు రాత్రి అక్కడ నుంచి తన స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరుకు వెళ్లారు. పీఠంపై హక్కును కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకూ.. ఆమె ఎక్కడ ఉందీ కందిమల్లాయపల్లి గ్రామస్తులకు తెలియదు. మారుతీ మహాలక్షమ్మ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి పలు వీలునామాలు రాశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడు తరాలుగా బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల్లో పెద్దవారే మఠం పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి రాసిన వీలునామాలు చెల్లుతాయా..? లేదా..? ఏపీ హైకోర్టులో ఏం జరగబోతోంది..? చూడాలి.
Also Read : ఊహించని వివాదం సద్దుమణిగింది.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక పూర్తి..