నిన్న విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని ఆ నిధులను బ్రాహ్మణ సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న బొండా ఉమా చంద్రబాబు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ నెలకొల్పారని అంటూ దాని వలన ఎంతో మంది పేద బ్రాహ్మణులకు పెన్షన్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరణించిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచారట. ఈ మేరకు తమ పార్టీ బ్రాహ్మణ పక్షపాతి అని చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాక వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు విలన్ అన్నట్టు కామెంట్లు చేశారు.
దీనికి తోడు మల్లాది విష్ణు టార్గెట్ గా రెచ్చిపోయిన ఉమా గతంలో తాను బ్రాహ్మణులకు చేసిన ద్రోహాలు అన్నీ మరచిపోయి తాను బ్రాహ్మణ బంధు అని ముద్ర వేసుకోవడానికి తాపత్రయ పడ్డారు. మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో టీడీపీ సామాజిక వర్గ సూత్రాన్ని పాటిస్తూ వారి సామాజిక వర్గం వారి చేతనే టార్గెట్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ సహాయంతో నడిచే బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణులను ఆదుకోవడం లో విఫలం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడవు, కానీ ఎక్కడా లేని విధంగా విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణును టార్గెట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో? మల్లాది పని తీరు విషయంలో ఎలాంటి వంకలు పెట్టలేక ఈ వాదాన్ని తెర మీదకు తెచ్చినట్టు కనిపిస్తోంది.
ఇక టీడీపీ హయాంలో మల్లాది విష్ణును ఇబ్బంది పెట్టిన తీరు నగర వాసులందరికీ తెలుసు, కనీసం ఆయన నియోజకవర్గంలో తిరగడానికి కూడా లేకుండా చేసిన వ్యవహరం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఉమా బ్రాహ్మణులు పేరిట రాజకీయం చేయడం కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం బానే ఉంది కానీ బ్రాహ్మణులకు ఆయన చేసిన ద్రోహం, నష్టం గురించి ఏం సమాధానం చెబుతారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి బోండా ఉమ తన నియోజకవర్గంలో బ్రాహ్మణుల అన్ని కార్యక్రమాలకు ఆలవాలంగా ఉంటూ వచ్చిన సీతారామ కళ్యాణ మండపాన్ని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవడానికి ఆలోచిస్తున్న సమయంలో వెనువెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆ రోజుల్లో లేఖలు రాసిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
అప్పట్లో బ్రాహ్మణ ఐక్యవేదిక ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియోజకవర్గం మొత్తం మీద బోండా ఉమకు వ్యతిరేకంగా పాంప్లెట్లు పంచిన విషయం విజయవాడ వాసులకు గుర్తు ఉండే ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ పదవులు అనేవి ఎమ్మెల్యేలకు ఇవ్వకూడదు అనే ఒక పాలసీ ప్రకారం మల్లాది విష్ణుకు కార్పొరేషన్ బాధ్యతల నుంచి తప్పించి మరో నేతకు అప్పగించారని అంతే కానీ కార్పొరేషన్ ఎలాంటి పనులు చేయడం లేదు అనడం సబబు కాదు. నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే కాని ప్రభుత్వం బ్రాహ్మణులకు చేయాల్సిన పనులను ఎక్కడా క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. బ్రాహ్మణులకు రాజకీయంగా అవకాశం కల్పిస్తూ వైఎస్ జగన్ మాత్రమే అసెంబ్లీ టికెట్లు కేటాయించారు, టిడిపి ఒక్క టికెట్ కూడా కేటాయించక పోయినా ఇప్పుడు టిడిపి బ్రాహ్మణులకు ఏదో చేసేసింది అంటూ ప్రచారం చేసుకోవడం, వారికి అండగా మేముంన్నాం అంటూ ప్రేమ చూపడం కేవలం రాజకీయం కోసమే అనిపిస్తోంది.
బ్రాహ్మణులకు రాజకీయంగా అలాగే ఆర్థికంగా కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నాటి వైఎస్ఆర్ అలాగే నేటి వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. కార్పొరేషన్ ఒక దానిని ఏర్పాటు చేసి దాని వలన ఎలాంటి ఉపయోగం లేకుండా నామమాత్రంగా కార్పొరేషన్ నడిపిన దాని కంటే జగన్ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణులు ఇబ్బందులు లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేవలం మల్లాదిని టార్గెట్ చేయడం కోసమే బ్రాహ్మణులను వాడుకుంటున్నారు తప్ప మరో కారణం ఏమీ కనిపించడం లేదు. అసలు బోండా ఉమకు బ్రాహ్మణుల మీద ఉంది ప్రేమా? లేక మల్లాది విష్ణు అంటే కోపమా ? అనే ప్రశ్న వేస్తే సమాధానం ఇట్టే తెలిసిపోతుంది.