iDreamPost
iDreamPost
లాక్ డౌన్ అయిపోయింది కదా తెలుగు తమిళ పరిశ్రమల్లాగే మనమూ సినిమాలు విడుదల చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్న బాలీవుడ్ నిర్మాతలకు నిద్ర లేని రాత్రులే మిగులుతున్నాయి. కమర్షియల్ బిజినెస్ కు కేంద్రంగా మారిన మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో మళ్ళీ వాయిదాల పర్వం తప్పడం లేదు. అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధపడుతోంది. ఇప్పటికే కర్ఫ్యూ లాంటి చర్యలతో మెల్లగా వేగం పెంచుతోంది. థియేటర్లు ప్రస్తుతానికి యాభై శాతం కెపాసిటీతో తెరిచే ఉన్నాయి కానీ జనాలు హౌస్ ఫుల్ చేసేంత కెపాసిటీ ఉన్న హిందీ మూవీస్ రావడం లేదు. వచ్చిన ఒక్క ముంబై సాగా కూడా సోసో ఫలితాన్నే అందుకుంది.
దీంతో ఇంకో రెండు మూడు నెలలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చాక కేసులు తగ్గుతాయి అనుకుంటే ఇప్పటికైతే అలాంటి సీన్ పెద్దగా కనిపించడం లేదు. వైరస్ పాకకుండా కట్టడి అవుతోంది కానీ అదీ పూర్తి గ్యారెంటీని ఇవ్వడం లేదు. ఈ నెలలో అందరి కళ్ళు అక్షయ్ కుమార్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. దీంతోనే తమకు పునర్వవైభవం వస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. ఆ తర్వాత వరసలో సల్మాన్ ఖాన్ రాధే లాంటి క్రేజీ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పుడీ సిచువేషన్ చూస్తుంటే ఇది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ఇప్పటికే ఏడాదికి పైగా లాక్ డౌన్ వల్ల బాలీవుడ్ కొన్ని వందల కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇప్పటికైనా కోలుకుంటుందని ఆశపడితే అవి సన్నగిల్లుతున్నాయి. ఈ పరిణామాలు గమనించిన కొందరు నిర్మాతలు ఆల్రెడీ ఓటిటి సంస్థలకు కబురు పెట్టేశారు. తమ కంటెంట్ మీద గట్టి నమ్మకం లేనివాళ్లు డీల్స్ కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే జూన్ లేదా జూలై దాకా హిందీ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకునే అవకాశాలు లేనట్టే. చిన్నా చితక సినిమాలు ఎన్ని వచ్చినా వాటి వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. స్టార్ హీరోలైతేనే మార్కెట్ లో ఊపుతీసుకొస్తారు. కానీ ఇప్పుడీ సిచువేషన్ వల్ల మళ్ళీ ప్రాణసంకటం మొదలయిందని మాత్రం చెప్పొచ్చు