సైరా తర్వాత లాక్ డౌన్ నుంచి తన సినిమాల లైన్ అప్ పెంచేసిన చిరంజీవి ఆచార్య కాకుండా ఒకేసారి మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అతి త్వరలో లూసిఫర్ రీమేక్ మొదలుకానుంది. దర్శకుడు మోహన్ రాజా సర్వం సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్నాడు. మరోవైపు మైత్రి బ్యానర్ పై బాబీ డైరెక్ట్ చేయబోయే సినిమా తాలూకు వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. చూస్తుంటే మెహర్ రమేష్ సినిమానే కొంత ఆలస్యమయ్యేలా ఉంది. దీని గురించిన లీకులు పెద్దగా బయటికి రావడం లేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం తెరవెనుక జరిగిపోతోందని సమాచారం. వచ్చే ఏడాది చివరి లోగా అన్నీ రిలీజ్ చేసేయడం టార్గెట్.
ఇక అసలు విషయానికి వస్తే బాబీ తీర్చిదిద్దిన ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ కి ఇద్దరు ఇమేజ్ ఉన్న యూత్ హీరోల అవసరం ఉందట. దాని కోసం సాయి తేజ్, వరుణ్ తేజ్ లు ఇద్దరినీ కలిసే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. తమ కెరీర్ కి ఇంత బలమైన పునాది వేసిన మావయ్య సినిమాలో అవకాశం వస్తే అంతకంటేనా అని ఒప్పుకుంటారో లేక ఇమేజ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో నో అంటారో ఇంకా తెలియదు. అయితే ఇదంతా యూనిట్ నుంచి అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం స్క్రీన్ మీద మంచి కలర్ ఫుల్ కాంబినేషన్ అవుతుంది.
జై లవకుశ తర్వాత వెంకీ మామతో మంచి సక్సెస్ లే అందుకున్నప్పటికీ బాబీకి తన డెబ్యూ మూవీ పవర్ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇంకా పడలేదు. మధ్యలో సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తీవ్ర ప్రభావం చూపించింది. అందుకే వెంకీ మామ వచ్చాక గ్యాప్ తీసుకుని మరీ మెగా సబ్జెక్టుని రెడీ చేశాడు. ఇది కనక ఖచ్చితంగా క్లిక్ అయితే మరోసారి టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మైత్రి నిర్మాతలు ఇది గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు తరహాలో వింటేజ్ చిరంజీవిని చూపిస్తుందని ఊరించడంతో అభిమానుల అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. మరి తమ్ముడితో ఫెయిల్ అయిన బాబీ అన్నయ్యతో అయినా గట్టి హిట్టు కొడతాడేమో చూడాలి