iDreamPost
iDreamPost
మాస్ ప్రేక్షకుల అండతో కమర్షియల్ స్టార్లుగా ఎదిగిన హీరోలు సరైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తే బాక్సాఫీస్ రికార్డులు ఏ స్థాయిలో బద్దలవుతాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దానికి వందల వేల ఉదాహరణలు కనిపిస్తాయి. వరస పరాజయాలు లేదా డిజాస్టర్లతో మార్కెట్ కొంచెం డౌన్ అయినప్పుడు మళ్ళీ లేపి సింహాసనం మీద కూర్చోబెట్టేది మాస్ ఎంటర్ టైనర్లే. నందమూరి బాలకృష్ణకు ఇది ఎన్నో సార్లు అనుభవమే. 1993లో బాలయ్య హీరోగా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి త్రివిక్రమరావు బొబ్బిలి సింహం ప్రాజెక్టు ప్రకటించారు. అప్పటికే ఈ బ్యానర్ లో రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఉండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ దానికి పని చేసిన దర్శకుడు బి గోపాల్, హీరోయిన్ విజయశాంతిలతోనే ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఎందుకో కథ సరిగా కుదరని కారణంగా కాంబినేషనే మారిపోయింది. సీన్లోకి ఏ కోదండరామిరెడ్డి వచ్చారు. విజయశాంతి స్థానంలో మీనా-రోజాలను తీసుకొచ్చారు. అంతకు ముందు అనుకున్న కథను పూర్తిగా పక్కకు పెట్టేసి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ చదువుకున్న యువకుడు ఊరి మంచి చెడ్డలను చూసుకుంటూ పంచాయితీ పెద్దగా తీర్పులిచ్చే పాత్రగా మలిచారు. పెళ్లి చేసుకున్నా పంతంతో కాపురం చేయనివ్వకుండా భర్తను బాధ పెట్టే పెళ్ళాంగా రోజా, ఇదివరకే హీరోకు వివాహమయ్యిందని తెలియక అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకునే అమాయకపు అమ్మాయిగా మీనా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారు. నాన్నమ్మగా శారద, విలన్లుగా సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు ఫిక్సయ్యారు. మంచి ఫామ్ లో ఉన్న కీరవాణి అదిరిపోయే ట్యూన్లతో మసాలా ఆల్బమ్ రెడీ చేశారు.
సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఏదీ మిస్ అవ్వకుండా అన్ని కొలత వేసి తూచినట్టు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. పొలాలను ఆక్రమించడానికి వచ్చిన కలెక్టర్ ని విజయరాఘవభూపతి బెదిరించడం, మానభంగం ఆరోపణలు ఎదురుకున్న ఎంపిని స్థంబానికి కట్టేసి శిక్ష విధించబోతే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రితో హీరో ఎదురుతిరగడం లాంటి సీన్లు ఓ రేంజ్ లో పేలాయి. ఊహించని రీతిలో రోజా పాత్రకు క్యాన్సర్ ట్విస్ట్ పెట్టి చివర్లో ఆమె కన్నుమూసే సీన్ ని కంటతడి పెట్టేలా చిత్రీకరించారు. టైటిల్ రోల్ లో బాలయ్య విశ్వరూపం ఇందులో చూడొచ్చు. 1994 సెప్టెంబర్ 23న విడుదలైన బొబ్బిలి సింహం భారీ అంచనాలు నిలబెట్టేసుకుంది. ఫలితంగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సూపర్ హిట్టు కొట్టి పదిహేనుకి పైగా కేంద్రాల్లో వందరోజులు ఆడేసింది. నాన్న బొబ్బిలి పులి, కొడుకు బొబ్బిలి సింహం ఇద్దరూ ఇద్దరే అని అభిమానులు ఎంతగా మురిసిపోయారో. ఇవాల్టితో ఈ సినిమా 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.