iDreamPost
iDreamPost
దేశంలో ధరల భారం అసాధారణంగా ఉంది. సామాన్యులు చితికిపోతున్నారు. చివరకు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని ఎంతగా వెలిబుచ్చినా స్పందించని కేంద్రానికి ఉప ఎన్నికల్లో ఓటుతో చీవాట్లు పెట్టారు. చలించిన కేంద్రం వరుసగా ధరల నియంత్రణ చర్యలకు పూనుకుంటున్నట్టు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల మీద ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం తాజాగా ఆయిల్ ధరల విషయంలో ఊరట కల్పించేందుకు పూనుకుంది. ఇది సామాన్యులకు మేలు చేసే చర్య. కేంద్రం ఇప్పటికయినా ధరలు తగ్గించడానికి ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపిరిపిట్టది మరోదారి అన్నట్టుగా ఉంది ఏపీలో కమలనాథుల పరిస్థితి. దేశమంతా ధరలు దిగి వస్తుండడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఏపీలో ధరలు తగ్గించాలని ఆపార్టీ నేతలు ఆందోళనకు పూనుకున్నారు. నిజానికి బీజేపీకి చిత్తశుధ్ది ఉంటే ధరలు పెంచడం ఎందుకు, మళ్లీ తగ్గించడం ఎందుకూ అనే ప్రశ్న వస్తోంది. పోనీ కేంద్రం తగ్గించేందే అనుకుందాం..మళ్లీ ఏపీలో ఆపార్టీ నేతలు రోడ్డెక్కడం ఎందుకూ విడ్డూరంగా. ఇప్పుడు బీజేపీ నేతలు సామాన్యులకు ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరం. మేము ధరలు పెంచాము.. ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 28 చొప్పన లీటర్ మీద పెంచాము. అందులో రూ. 5 తగ్గించాము అని చెబుతారా.. అంటే ఇంకా రూ. 23 ల పెంపుదల తాము చేసినట్టు అంగీకరించడమే కదా. అయినా అదంతా మాకు తెలియదు జగన్ ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాల్సిందే అంటారా..
Also Read ; Excise Duty Reduction – మోదీ దీపావళి బహుమతి.. పెట్రో వడ్డనకు బ్రేకులు.. అంతే!
నిజానికి పెట్రోల్, డీజిల్ ధరల మీద మూల ధర, డీలర్ కమిషన్, కేంద్రం వేసిన పన్నులు అన్నీ కలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి. ఈ వ్యాట్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులుంటాయి. దేశంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎక్కువగా ఉండేది. ఎంపీలో కొంచెం తగ్గించేందుకు ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక 2014 మే నాటికి లీటర్ పెట్రోల్ మీద ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ కేవలం రూ. 9.48 పైసలు. దానిని మోడీ ప్రభుత్వం రూ. 32 లు దాటించింది. అంటే మూడు రెట్లు పెంచేసింది. ఇప్పుడు అందులో రూ. 5 తగ్గించి, ఇంకా రూ. 27 చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విధించే వ్యాట్ కూడా కేంద్రం పన్నులు తగ్గించిన తర్వాత ఒక్కో రూపాయి చొప్పున తగ్గుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగ్గినట్టే భావించాల్సి ఉంటుంది.
కానీ బీజేపీ నేతలు మాత్రం ఏపీలో పన్నులు తగ్గించాల్సిందేనని ఆందోళనకు పూనుకుంటున్నారు.
మంచిదే ప్రజా సమస్యల మీద ప్రశ్నించడం ప్రతిపక్షంగా వారి బాధ్యత. కానీ తాము అధికారంలో ఉన్న చోట్ల తొలుత పూర్తి చేసి తర్వాత మిగిలిన వాళ్లని ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. కానీ త్వరలో ఎన్నికలు జరగాల్సిన యూపీ, గోవాలో తగ్గించి, ఇటీవల ఎన్నికలు పూర్తయిన అసోంలో ఎందుకు తగ్గించలేదంటే బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారు. అంటే ఏపీలో పెట్రోల్ మీద రాష్ట్రం పన్ను తగ్గించాలని ప్రశ్నించే బీజేపీ నేతలకు తాము అధికారంలో ఉన్న బీహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్ వంటివి పట్టవా. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వమే ఎక్సైజ్ సుంకం పెంచినదంతా తగ్గించేస్తే ఇక రాష్ట్రాల పన్నులకు అవకాశం ఏముంటుంది. అంటే కేంద్రంలో తాము భారీగా పెంచి కొంత ఊరట ఇవ్వడమే ఘనతగా చెప్పుకునేందుకు రోడ్డెక్కడం ఏపీ బీజేపీ నేతల వైఖరిని చాటుతోంది.
ప్రజల మీద ప్రేమ ఉంటే తొలుత కేంద్రం కనీసం ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన రూ. 28 అయినా తగ్గించాలి. అందుకు భిన్నంగా తాము భారీగా పెంచేసి కొద్దిగా ఊరటనివ్వడమే విజయం అని చెప్పుకుంటే జనం హర్షించరని గుర్తించాలి. తమ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేయాలని ప్రయత్నిస్తే సహించరని గ్రహించాలి.
Also Read : Cooking Oil Prices – వంట నూనెల ధరలు.. కేంద్రం కంటితుడుపు చర్యలు