iDreamPost
android-app
ios-app

పుణ్యకాలం ముంచుకొస్తున్నా వీడని పీటముడి

  • Published Jun 14, 2021 | 1:05 PM Updated Updated Jun 14, 2021 | 1:05 PM
పుణ్యకాలం ముంచుకొస్తున్నా వీడని పీటముడి

ఉమ్మడిగా అధికారమైతే దక్కించుకుందిగానీ.. పదవుల పీటముడి విప్పుకోలేక పుదుచ్చేరి ఎన్డీయే కూటమి ఆపసోపాలు పడుతోంది. ఈలోగా కొత్త శాసనసభ కొలువుదీరాల్సిన పుణ్యకాలం ముంచుకొస్తోంది. అయినా కూటమిలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవుల విషయంలో పట్టు వీడటంలేదు. దాంతో ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర రోజులైనా.. ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రభుత్వం లేకుండాపోయింది. పాలన గాడ్డితప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

16న కొత్త అసెంబ్లీ భేటీ.. అదే రోజు స్పీకర్ ఎన్నిక

నిబంధనల ప్రకారం ఈ నెల 16న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు సమావేశ నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై అనుమతి కూడా ఇచ్చారు. స్పీకర్ ఎన్నిక అదే రోజు జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 15న(రేపు) జారీ చేస్తారు. అధికారపరంగా ఏర్పాట్లు జరిగిపోతున్నా.. రాజకీయంగా ఇంకా సందిగ్ధత వీడలేదు. స్పీకర్ పదవిని ఏ పార్టీ తీసుకుంటుంది. అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికీ తేలలేదు. ప్రజాతీర్పు ద్వారా ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలతో ఏకైక పెద్ద పార్టీగా ఉన్న ఎన్ ఆర్ కాంగ్రెసుపై ముగ్గురు నామినేటెడ్, ముగ్గురు స్వతంత్రులతో కలుపుకొని తన బలాన్ని 12కు పెంచుకున్న బీజేపీ పదవుల విషయంలో తీవ్ర ఒత్తిడి తెస్తోంది. స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి వంటి కీలక పదవుల కోసం పట్టుబడుతోంది. ఇందుకు సీఎం రంగస్వామి ససేమిరా అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో మంతనాలు కూడా జరిగాయి. ఒప్పందం కుదిరిందని కొద్దిరోజుల క్రితం బీజేపీ నేతలు ప్రకటించారు. మళ్లీ ఏమైందో గానీ ఇప్పటికీ వివాదం కొలిక్కి రాలేదు.

స్పీకర్ గా ఉమ్మడి అభ్యర్థే ఉండాలి

స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటున్న బీజేపీ తమ పార్టీ నేత ఎంబలం సెల్వం పేరును తెరపైకి తెచ్చింది. కానీ పదవుల పంపకాలు కొలిక్కి రాకపోవడంతో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆయన కాకపోతే నామినేటెడ్ ఎమ్మెల్యేల్లో ఒకరిని స్పీకర్ పదవికి ప్రతిపాదించాలని ఆలోచిస్తోంది. అయితే నామినేటెడ్ ఎమ్మెల్యేను అంగీకరించబోమని స్వతంత్ర ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. పోటీ నివారించి.. ఉమ్మడి అభ్యర్థినే స్పీకర్ పదవికి నిలబెట్టాలని వారు సీఎం రంగస్వామిని కలిసి కోరారు. స్పీకరుతో పాటు తమ ఎమ్మెల్యే నమశ్శివాయంకు హోంమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ గడువు సమీపిస్తుండటంతో.. వివాదానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

Also Read : కాషాయ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌