సుబ్రహ్మణ్య స్వామి. జాతీయ రాజకీయాల్లో ఆయన తీరు నిత్యం వార్తల్లో ఉంటుంది. బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రస్తుతం మోడీ నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకనాడు మోడీకి మద్ధతుగా తన వాణీ వినిపించిన ఆయన ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైపల్యాలను పదే పదే ఎండగడుతున్నారు. విధానపరంగా తీవ్ర విమర్శలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో నెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ పదవీకాలం పొడిగించేందుకు మోడీ నాయకత్వంలో బీజేపీ నేతలు సిద్ధంగా లేరనే ప్రచారం సాగుతోంది. దాంతో త్వరలో సుబ్రహ్మణ్య స్వామి పదవీకాలం ముగుస్తుండగా ఆయన తాజాగా వైఎస్సార్సీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వ తీరుని సమర్థిస్తున్నారు. మతం కోణంలో జగన్ మీద చేస్తున్న విమర్శలను ఆయన కౌంటర్ చేస్తున్నారు. చివరకు ఆంధ్రజ్యోతి పత్రిక టీటీడీ మీద రాసిన కథనాలపై ఆయన కోర్టులో కేసులు కూడా వేసి న్యాయపోరాటానికి దిగారు. క్రైస్తవ కోణంలో జగన్ మీద చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబడుతున్నారు. ఏపీలో విపక్షాల మత రాజకీయాలను నిరసించారు.
ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి తాడేపల్లిలోని సీఎంవోలో జగన్ తో భేటీ కావడం చర్చనీయాంశం అయ్యింది. వారిద్దరి మధ్య భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమికి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీలోనే నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నేతలు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక పలువురు సీఎంలను వరుసగా మార్చేస్తున్న తరుణంలో బీజేపీ శిబిరంలో పూర్తి ఐక్యత కష్టమేనన్నట్టుగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ వంటి నాయకునితో బీజేపీ ఎంపీగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సమావేశం ఆసక్తికరమే.
Also Read : దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడు సుబ్రమణ్య స్వామి