iDreamPost
android-app
ios-app

కొడుకు కోసం…తల్లి పదవీ త్యాగం

  • Published Jan 20, 2022 | 5:45 AM Updated Updated Jan 20, 2022 | 5:45 AM
కొడుకు కోసం…తల్లి పదవీ త్యాగం

‘మన పార్టీ కుటుంబంలో ఒక్కరికే సీటు ఇస్తామంటుంది. నా కుమారుడుకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వండి… నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను’ అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకురాలు… అలహాబాద్‌ ఎంపీ రీటా బహుగుణ జోషి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాయడం యూపీలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

భారతదేశ రాజకీయాల్లో వారసత్వం సర్వసాధారణం. ఒక్క నెహ్రూ కుటుంబమే కాదు… చాలా రాష్ట్రాలను కొన్ని కుటుంబాలు దశాబ్ధాల కాలంగా ఏలుతున్నాయంటే దేశంలో వారసత్వ రాజకీయాలు ఎంతగా పునాధి వేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలామంది నాయకులు తాము పదవుల్లో ఉండగానే వారసులకు అవకాశం కల్పిస్తారు. మరికొందరు తాము తప్పుకునే సమయంలో వారసులను తీసుకువచ్చి పెడతారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడంలో ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీలో సైతం వారసత్వ రాజకీయాలకు కొదవ లేదు. అయితే ఈ పార్టీలో వారసులను తీసుకువచ్చేందుకు ఒక నిబంధన కాస్త అడ్డుగా ఉంది.

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సీటు ఇస్తామని పార్టీ పెద్దలు చెబుతుండడంతో ఎంపీ రీటా బహుగుణ జోషి తాను తప్పుకుంటానని, తన కుమారుడుకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జోషి కుమారుడు మయాంక్‌ జోషి లక్నో కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. 2009 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తన కుమారుడికి అవకాశం కల్పించాలని ఎంపీ బహుగుణ జోషీ కోరుతున్నారు. ‘నేను ఈ ప్రతిపాదనను బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు ఉత్తరం రాశాను. అధిష్టానం నిర్ణయం ఏమైనప్పటికీ నేను పార్టీ తరపున పనిచేస్తూనే ఉంటాను. అంగీకరించడం, లేదా తిరస్కరించడం అనేది పార్టీ చేతుల్లో ఉంది’ అని ఆమె తెలిపారు.

అలహాబాద్‌ ఎంపీగా బహుగుణ జోషీ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతో మొదలైంది. 1995 నుంచి 2000 వరకు అలహాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అలాగే యూపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా, ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. గతంలో ఆమె 2012లో కాంగ్రెస్‌ పార్టీ తరపున, 2017లో బీజేపీ తరపున లక్నో కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున అలహాబాద్‌ నుంచి 2019లో ఎంపీగా గెలిచారు. ఈమె సోదరుడు విజయ బహుగుణ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Also Read : కమలదళంలోకి ములాయం చిన్న కోడలు