Idream media
Idream media
తన రాజకీయ జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. 2019లో ఘోర ఓటమి, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి, సొంత నియోజకవర్గం కుప్పంలోనూ స్థానిక పోరులో ఓటమి వెరసి.. చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిణామాలతో టీడీపీలో నాయకత్వ మార్పు జరగాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు గత రెండేళ్లుగా చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే బాబు ప్రయత్నాలకు బీజేపీ స్థానిక నేతలు గండికొడుతున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018లో తెగతెంపులు చేసుకుని, బీజేపీని, ప్రధాని మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో తనపై, తన ప్రభుత్వంపై విమర్శలు చేసే స్థానిక నేతలను బద్నాం చేసే ప్రయత్నాలను అనుకూల మీడియా ద్వారా చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీతో భాగస్వామ్యం ఉన్నా.. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు తరచూ టీడీపీ ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. టీడీపీతో తెగతెంపులు తర్వాత.. వారు స్వరం మరింత పెంచారు. అమరావతి భూ కుంభకోణం, పోలవరం ప్రాజెక్టులో అవినీతి, ఇసుక, మద్యం, నీరు–చెట్టు.. ఇలా ప్రతి అంశంలో జరిగిన అవినీతిని సోము, జీవీఎల్ ఎండగట్టారు.
నాడు టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతిపై ఇప్పటికీ బీజేపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. బీజేపీకి దగ్గరవ్వాలనే బాబు ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా మోడీ ప్రభుత్వానికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సేవా హి సంఘటన్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతి కుంభకోణం, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని జీవీఎల్ స్పష్టం చేశారు. అమరావతి భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం అరకొర విచారణ చేసిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందేనని జీవీఎల్ పునరుద్ఘాటించడం.. బీజేపీ పంచన చేరాలనుకుంటున్న బాబుకు మింగుడు పడని విషయమే.
Also Read : ప్రతిపక్ష పాత్రకు టీడీపీ ఎంత న్యాయం చేసింది?