iDreamPost
android-app
ios-app

రైతు ఉద్యమంపై ఎదురుదాడి

రైతు ఉద్యమంపై ఎదురుదాడి

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దేశ రాజధాని శివారులో రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. రైతుల ఆందోళనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతానికి ప్రతి రోజూ వేలాది మంది రైతులు అదనంగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే రిలయెన్స్, అదానీ గ్రూప్ ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు శనివారం బీజేపీ నేతల ఘెరావ్ కు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనపై కేంద్ర ఎదురుదాడికి సిద్ధమైంది.

సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల పట్ల రైతు సంఘాలు ఆది నుంచీ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చిన నాటి నుంచీ నిరాటంకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాయి. మూడు నెలల పాటు కొనసాగిన తమ ఉద్యమాన్ని దేశ వ్యాప్త ఆందోళనగా మలిచారు పంజాబు, హర్యానా రైతులు. ముప్పై ఐదు రైతు సంఘాలతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. పోరాటాన్ని నేరుగా కేంద్రం మీదికి ఎక్కుపెడుతూ నవంబర్ 26న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ రాజధానికి బయలుదేరిన లక్షలాది మంది రైతులను ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకున్న ప్రభుత్వం వారిపై లాఠీలు, బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయయోగించింది. దీంతో సింఘూ, టిక్రి సరిహద్దుల్లో నిలిచిపోయిన లక్షలాది మంది రైతులు సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కితగ్గమని భీష్మించుకుకూర్చున్నారు.

పక్షం రోజులకు పైగా ఎముకలు కొరికే చలిలో నిరీక్షిస్తున్న రైతులతో కేంద్రం ఇప్పటి వరకు ఐదు దఫాలు చర్చలు జరిపింది. ప్రభుత్వం ప్రతిపాధించిన సవరణలకు రైతులు అంగీకరించకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు మినహా, మరే సవరణకూ తాము అంగీకరించబోమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. రైతుల డిమాండ్లను పట్టించుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో తమ ఆందోళనలను తీవ్రతరం చేయడానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. మరో వైపు రైతుల ఆందోళనలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దేశంలోని వేరు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లోనూ రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఉద్యమాన్ని ఉదృతం చేసిన రైతు సంఘాలు ఇవాళ ఢిల్లీ – జైపూర్‌, ఢిల్లీ – ఆగ్రా రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యాయి. టోల్‌గేట్ల వద్ద రుసుం చెల్లించకుండా నిరసన తెలపడంతో పాటు బీజేపీ నేతల ఘెరావ్ కు పిలుపు నిచ్చాయి. ఈనెల 14న ఉత్తర భారతదేశంలోని రైతులంతా ఢిల్లీని ముట్టడించాలని, దక్షిణ భారతదేశంలోని రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబరు 15న ముంబైలో, 16న కోల్‌కతా లో నిరసనలు చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. మరోవైపు… నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ భాను సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు మూడు పిటీషన్లు ఉన్నాయి. వీటిపై నెలాఖరు వరకు విచారణ జరిపే అవకాశం ఉంది. రోజు రోజుకూ పరిస్థితులు కేంద్రానికి ప్రతికూలంగా మారుతుండడంతో రైతుల ఉద్యమంపై ఎదురుదాడి మొదలు పెట్టింది ప్రభుత్వం.

ఎదురు దాడి

రైతులతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని ప్రకటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలు చర్చల నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాయని ఆరోపించారు. రైతుల ఆందోళనలోకి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడుతున్నాయని, మావోయిస్టు అనుకూలురు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే అవకాశముందని హెచ్చరించారు. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా టిక్రీ సరిహద్దులో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతులు రాజకీయ ఖైదీల విడుదలకు డిమాండ్ చేయడాన్ని మంత్రి తోమర్ గుర్తు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, భీమా కోరేగావ్ కేసుల్లో అరెస్టయిన విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సీఏఏ వ్యవతిరేక ఆందోళనలో పాల్గొన్న కారణంగా అరెస్టయిన షర్జీల్ ఇమార్, ఉమర్ ఖలీద్, ఖాలిద్ షఫి, బీమా కోరేగావ్ కేసుల్లో అరెస్టయిన సుధా భరద్వాజ్, గౌతమ్ నవలాఖ, స్టాన్ స్వామి తదితరుల ఫొటోలను ప్రదర్శి్ంచారు. ఇప్పుడీ విషయాన్ని ప్రస్తావిస్తున్న కేంద్రం రైతు ఉద్యమంలో వామపక్ష తీవ్రవాద సంస్థలున్నాయనే ఆరోపణలకు తెరతీసింది.

రైతు ఉద్యమంపై బీజేపీ నేతలు వరుసగా వివాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతు ఆందోళనల్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వ్యాఖ్యానించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రావుసాహెబ్ దన్వే నూతన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తున్న రైతుల వెనుక చైనా, పాక్ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి తోమర్ రైతు ఆందోళనల్లో వామపక్ష తీవ్రవాదులున్నారనే వాదనను ముందుకు తెచ్చారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రైతుల ఉద్యమాన్ని అణచివేసే దిశలో కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించిన భేటీ అందుకు ఊతమిస్తోంది. ఇప్పటికే సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో వేలాది వేలాది పోలీసు బలగాలు మోహరించాయి. రోజు రోజుకూ దేశ రాజధానికి బయలుదేరుతున్న రైతుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం కొత్త ఎత్తుగడలకు తెరతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.