Idream media
Idream media
ఏ రెండు పార్టీలైనా పొత్తు పెట్టుకున్నాయంటే కలిసి పని చేస్తాయి. అది ఎన్నికల వేళే కాదు.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలైనా, సేవా కార్యక్రమాలైనా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలైనా. కానీ, ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు అనేది నేతల ప్రకటనల్లోనే కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒకటి, రెండు సార్లు కలిసి ప్రచారం చేయడానికే పరిమితం అవుతున్నారు కానీ.. ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తర్వాత పార్టీ సమీక్షలు, సమావేశాలు అంటూ బీజేపీ అధ్యక్షుడు సోము తన దారిలో వెళ్తుండగా, సినిమాలు, స్టేట్ మెంట్ లకు జనసేనాని పరిమితం అయ్యారు.
ఇటీవల ఏపీలో సర్కారు కొత్తగా చెత్త పన్నును అమల్లోకి తెస్తోందని ఆస్తి పన్నును ఇష్టారాజ్యంగా పెంచేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ… అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. అనుకున్నట్లుగానే బీజేపీ నిరసనలు చేపట్టింది. అయితే ఈ నిరసనల్లో తమ మిత్రపక్షమైన జనసేన నేతలు మాత్రం కనిపించలేదు. మిత్రపక్షం నేతలుగా బీజేపీ ఆహ్వానించి ఉంటే… జన సేన నేతలు ఈ నిరసనల్లో పాలుపంచుకుని ఉండేవారేనేమో. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం లేని నేపథ్యంలో ఈ నిరసనల్లో ఒక్కరంటే ఒక్క జన సైనికుడు కూడా కనిపించలేదు. అయినా ఎవరైనా నిరసనలు చేపట్టే సమయంలో మరింత మంది కనిపించేలా ఆ నిరసనలు భారీ ఎత్తున సక్సెస్ అయ్యేలా జనాన్ని పెద్ద ఎత్తున కూడగట్టడం మనం చూస్తున్నదే. అయితే ఎందుకో గానీ.. ఈ కోణంలోనూ బీజేపీ నేతలు ఆలోచించలేదు. తమ మిత్రపక్షం జనసేన అంటూ ఒక పార్టీ ఉందన్న విషయాన్నే మరిచినట్టుగా బీజేపీ నేతలు వ్యవహరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఈ నిరసనల్లో కమలనాథులు మాత్రమే ప్లకార్లులు పట్టుకుని కనిపించారు. ప్రస్తుతానికి సినిమా షూటింగులు ఇతరత్రా కారణాలతో జనసేనాని పవన్ కల్యాణ్ అసలు బయటకే రావడం లేదు. ఇక పార్టీ తరఫున అప్పుడప్పుడే కనిపిస్తూ ఉన్న పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ నిరసనల్లో కనిపించలేదు. పోనీ… ఈ పన్ను పెంపుపై జనసేన సానుకూలంగా కూడా లేదాయే. ఇటీవలే ఈ పన్నుల అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ నాదెండ్ల మనోహరే ఓ ప్రకటన చేశారు. మరి ఓ అంశంపై మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలూ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నప్పుడు నిరసనలు తెలుపుతున్నప్పుడు కలిసి ఎందుకు ముందుకు సాగడం లేదు?.