అధికారమే పరమావధిగా తెలంగాణ బీజేపీ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడుంటే.. అక్కడకు వెళ్లి రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. తాజాగా సోమవారం నల్గొండ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రచ్చ రచ్చ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ దూకుడు బాగానే పెంచింది. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మిగతా నేతలకు భిన్నంగా కీలకమైన ప్రజాసమస్యలపై కేసీఆర్ ను నిలదీస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చేలా కమలనాథులు సరికొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. మున్ముందు ప్రణాళికలు అవసరాల రీత్యా కూడా కీలకమైన ఆ వ్యూహం అమలులో ఈటలకు కీలక నేతల సహకారాన్ని కూడా అందించేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.
ఇతర పార్టీల నేతలను ఇప్పటిదాక టీఆర్ఎస్ ఆకర్షించింది. ఆ వ్యూహాన్నే బీజేపీ అమలు చేయాలనుకుంటున్నది. టీఆర్ఎస్ నే టార్గెట్ చేయాలని భావిస్తున్నది . ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి కమలం గూటికి తీసుకురావాలనుకుంటున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీజేపీకి ఈ ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం గట్టిగా దృష్టి పెట్టనున్నది. దీర్ఘకాలిక అనుభవం టీఆర్ఎస్ లోని నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆ బాధ్యతను ఈటలకే అప్పజెప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఎవరెవరు అసంతృప్తి అసమ్మతితో ఉన్నారో రాజేందర్ కే ఎక్కువ అవగాహన ఉంటుందని.. అందుకే ఆయనకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నేతలు భావించారు. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
Also Read : Bandi Sanjay -బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి
గెలుపోటములను పక్కనబెట్టి అధికార పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హుజూరాబాద్ గెలుపుతో వేగం పెంచింది. నిత్యం టీఆర్ఎస్ ను ఏదో ఒక రూపంలో ఆత్మ రక్షణలోకి నెట్టాలని బీజేపీ చుట్టూనే దాని దృష్టి ఉండేలా ఉక్కిరిబిక్కిరి చేయాలనేది ప్లాన్. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను బీజేపీ బరిలో దించి అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. అయితే సంఖ్యాపరంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా టీఆర్ఎస్ లో క్రాస్ ఓటింగ్ భయాన్ని కలిగించాలని అనుకుంటోంది.
కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాలని పార్టీలో ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని ఆశించి భంగపడినవారితో సంప్రదింపులు జరిపి టికెట్ ఇచ్చి కమలం గూటికి తెచ్చే పనితోనే ఈ వ్యూహాన్ని అమలులో పెట్టాలని అనుకుంటోంది. ఈటల రాజేందర్ మధ్యవర్తిత్వం ద్వారా ఉద్యమకారులను కూడా ఆకర్షించే పనిలో ఉంది. అధికార పార్టీ అమలు చేయని గత హామీలను ప్రస్తుతం ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, వడ్ల కొనుగోలు నిరుద్యోగం దళితబంధు .. ఇలా అన్నింటిపై ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. ఆయా కార్యక్రమాల్లో ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చింది.
Also Read : Amit Shah, AP BJP -అమిత్ షా సూచనలు.. ఏపీలో బీజేపీ పుంజుకునేనా?