iDreamPost
android-app
ios-app

బద్వేలులో టీడీపీ ఓటు బ్యాంకుపైనే బీజేపీ గురి

  • Published Oct 07, 2021 | 8:10 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
బద్వేలులో టీడీపీ ఓటు బ్యాంకుపైనే బీజేపీ  గురి

ఓడిపోతామని తెలిసినా.. మిత్రపక్షం జనసేన కలిసి రాకున్నా బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి దిగిన భారతీయ జనతాపార్టీ నిర్ణయం వెనుక వేరే వ్యూహం ఉంది. నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే ఆ పార్టీ లక్ష్యమని తెలుస్తోంది. జనసేన తమకు దూరమై టీడీపీతో జత కడుతుందన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో సాధ్యమైనంత వరకు టీడీపీని దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ నిర్ణయం. మైత్రి బంధం నుంచి జనసేన దూరం అవుతున్న విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి.. వారి సూచన ప్రకారమే పోటీకి నిర్ణయించి.. టీడీపీ ఓటు బ్యాంకును చీల్చి సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించాలని భావిస్తున్నారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.

పోటీ నామమాత్రమే..

బద్వేలు సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధనే వైఎస్సార్సీపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. తెలుగుదేశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ ను మళ్లీ నిలబెడుతున్నట్లు ప్రకటించింది. అయితే సంప్రదాయం ప్రకారం దివంగత నేత కుటుంబంపై గౌరవంతో పోటీకి దూరంగా ఉంటామని జనసేన ప్రకటించడంతో ఒక్కసారి రాజకీయం మారిపోయింది. పునరాలోచనలో పడిన టీడీపీ తాను కూడా పోటీ నుంచి తప్పుకుంది. భవిష్యత్తులో జనసేనతో పొత్తును ఆశిస్తున్నందునే టీడీపీ ఆ పార్టీని అనుసరించిందన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు మిత్రపక్షం జనసేన తప్పుకోవడంతో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ ను ఖరారు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మ ఖరారయ్యారు. దాంతో ఎన్నిక ఏకగ్రీవం కాకపోయినా పోటీ ఏపక్షమన్నది తేలిపోయింది.

జనసేన నిర్ణయంతో వ్యూహం మార్చిన కమలం

వాస్తవానికి బద్వేలులో బీజేపీ పోటీ చేయాలనుకోలేదు. పవన్ కళ్యాణ్ తో జరిగిన చర్చల్లో జనసేన అభ్యర్థినే ఉమ్మడిగా నిలబెడదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిపాదించారు. దానికి స్పందించని జనసేనాని.. అనంతపురం పర్యటనలో తాము పోటీ చేయడంలేదని ప్రకటించారు. దాంతో అవాక్కయిన బీజేపీ రాష్ట్ర నేతలు అధిష్టానానికి విషయం వివరించారు. జనసేన టీడీపీకి దగ్గరవుతున్న విషయాన్నీ చెవిలో వేశారు. అధిష్టానం సూచన మేరకు పోటీకి నిర్ణయించుకున్నారు. దాంతోపాటే టీడీపీ ఓటు బ్యాంకుపై గురిపెట్టారు. ఉప ఎన్నికలో పార్టీ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డిలకు అప్పగించారు. వారిద్దరూ గతం టీడీపీలో ఉన్నవారే కావడంతో పోటీలో లేని ఆ పార్టీ ఓటు బాంకును కమలం వైపు మళ్లించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న చెత్త రికార్డును చెరిపేసుకుని గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని భావిస్తున్నారు.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక – బీజేపీ అభ్యర్థి ఖరారు

marsbahis giriş