iDreamPost
android-app
ios-app

కన్నా ఉనికి పాట్లు..!

కన్నా ఉనికి పాట్లు..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ సారధిని మార్చుతారనే ఊహాగానాలు ప్రారంభం అయినప్పటి నుంచీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఉనికి పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న డిమాండ్లు బూమరాంగ్‌ అవుతున్నాయి. విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతిచెందిన కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించడంతో నాలుక్కరుచుకున్నారు. పైగా ప్రభుత్వంపై ప్రశంసలు కూడా కురిపించాల్సి వచ్చింది. ప్రతి విషయంలో తానున్నానంటూ ఇటీవల ఉనికి చాటుకుంటున్న కన్నా.. సీఎంకు, ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. డిమాండ్‌ చేసేందుకు అవకాశం లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒక కారణం చెబుతూ డిమాండ్లతో లేఖలు రాస్తున్నారు.

తాజాగా ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో దళిత యువకుడి శిరోముండనం కేసుపై స్పందించారు. ఈ కేసులో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. తప్పు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారిని సస్పెండ్‌ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టి ఎస్‌ఐను రిమాండ్‌కు కూడా పంపారు. కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ సాగుతోంది. గంటల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం గమనార్హం. అయితే కన్నాలక్ష్మీ నారాయణ సరికొత్త డిమాండ్‌తో డీజీపీకి లేఖ రాశారు.

పోలీస్‌ స్టేషన్‌లో దళిత యువకుడు వర ప్రసాద్‌కు గుండుకొట్టిన ఘటన గర్హనీయమని ఆయన తన లేఖలో ఖండించారు. ప్రజాస్వామ్యచరిత్రలో క్షమించరాని, అమానవీయ, అనాగరిక చర్యగా ఈ ఘటనను అభివర్ణించారు. పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం కాదని, పోలీసు సిబ్బంది, అధికార పార్టీ నాయకుల మధ్య అపవిత్రమైన సంబంధాన్ని తేల్చాలని కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్‌ చేశారు. కానిస్టేబుళ్ల నుంచి డీఎస్పీ వరకూ సంబంధిత పోలీస్‌ సిబ్బంది అందరి కాల్‌ డేటాపై దర్యాప్తు చేయాలని కోరారు.

నిందితులపై కఠినచర్యలు తీసుకున్నా కూడా కన్నా లక్ష్మీ నారాయణ ఈ ఘటనపై అధికార పార్టీని లక్ష్యంగా చేసుకోని సరికొత్త డిమాండ్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పకుండానే ఎస్‌ఐ దళిత యువకుడికి శిరోముండనం చేయించరనే విషయాన్ని ఆయన తన డిమాండ్‌ ద్వారా తెరపైకి తెస్తున్నట్లుగా అర్థమవుతోంది. ప్రతి విషయంలో రాజకీయ కోణాన్ని వెతికేందుకు బీజేపీ సారధి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.