Idream media
Idream media
తాను ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలిచాడన్న మాదిరిగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అమరావతి విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి విషయంలో సుజనా చౌదరి ఒకటి తలుస్తుంటే.. బీజేపీ మాత్రం మరొకటి తలుస్తుండడం ఆయనకు ఏ మాత్రం మింగుడుపడడంలేదు. శనివారం అమరావతి జేఏసీ ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా సుజనా చౌదరి ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. రాజధానిని ఎవరూ మార్చలేరని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర జోక్యం చేసుకోదని, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
సుజనా చౌదరి ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఈ రోజు బీజేపీ నేత, పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి సునిల్ దేవధర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని చెప్పారు. భవిష్యత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అయితే సునిల్ దేవ్‌ధర్ అమరావతి విషయంలో బీజేపీ వైఖరిని మరోమారు వెల్లడించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే తమ నిర్ణయం అన్నారు. ఈ విషయంపై రైతుల తరఫున బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ శ్రేణులు కలసి పని చేస్తాయని స్పష్టం చేశారు.
సునిల్ దేవ్‌ధర్ ప్రకటనతో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గొంతులో పచ్చి వెలక్కాయ పడిన మాదిరిగా పరిస్థితి తయారైంది. అమరావతి విషయంలో కేంద్ర జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి చెప్పడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రకటనే చేసారు. అప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కేంద్ర ఏ మాత్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అయినా మళ్లీ సుజనా చౌదరి ఇలాంటి ప్రకటనే చేయడం, దాన్ని సునిల్ దేవ్‌ధర్ తొసిపుచ్చేలా స్పష్టత ఇవ్వడం గమనార్హం.
ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న సుజనా చౌదరి ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పొషించారు. 2012లోను ఆ తర్వాత 2018లోనూ టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో ఏపీలో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో ఉన్నా టీడీపీలో ఉన్న మాదిరిగానే ఆయన రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కలవడం బీజేపీని ఇరుకున పెట్టింది. రాజధాని విషయంలో బీజేపీలో ఆది నుంచి ఉన్న జీవీఎల్, సోము వీర్రాజు తదితర నేతలు ఒకలా.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, పురందేశ్వరి తదితరులు మరోలా మాట్లాడుతున్నారు. వారి మాటలను ఎప్పటికప్పడు బీజేపీలో ఆది నుంచి ఉన్న నేతలు ఖండించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.