iDreamPost
android-app
ios-app

బిహార్ : చివ‌రి వారంలో ఏం జ‌రిగింది..?

బిహార్ :  చివ‌రి వారంలో ఏం జ‌రిగింది..?

బిహార్ ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితం రావ‌డానికి ఇంకా రెండు రోజుల స‌మ‌యం ఉంది. ఈలోగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ తో జేడీయూ – బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూట‌మిలో క‌ల‌క‌లం రేగుతోంది. ఎంతో ధీమాగా ఉన్న కూట‌మిలో కాస్త అనుమానం మొద‌లైంది. ఒకవేళ నిజంగా నితీశ్ ఓటమిపాలైతే.. అది ఆయ‌న ఒక్క‌రి ఓట‌మి మాత్ర‌మే కాదు.. బీజేపీపై కూడా ప్ర‌భావం చూపుతుంది. అంతేకాదు.. వ‌చ్చే ఏడాది లో జ‌రిగే త‌మిళ‌నాడు, బెంగాల్, అస్సాం ఎన్నిక‌ల‌పై కూడా ఆ ప్ర‌భావం ఉండొచ్చు. పోలింగ్ కు వారం రోజుల క్రితం ప్ర‌క‌టించిన కొన్ని స‌ర్వేల‌లో ఎన్డీయే కూట‌మికే విజ‌యావ‌కాశాలు అన్న‌ట్లు తేలింది. పోలింగ్ జ‌రిగిన అనంత‌రం సీను మారింది. స‌ర్వేల‌న్నీ నితీశ్ కు ఓట‌మి త‌ప్ప‌వంటున్నాయి. పోల్స్ నిజ‌మైతే చివ‌రి వారంలోనే ఓట‌రు నాడి మారిన‌ట్లు భావించాలి.

రెండు రోజుల క్రితం కూడా…

పోలింగ్ కు ఒక‌టి, రెండు రోజుల క్రితం వ‌చ్చిన కొన్ని స‌ర్వేలు కూడా నితీశ్ కే ప‌ట్టం క‌ట్టాయి. కొన్ని సంస్థ‌లు ముంద‌స్తుగానే ఫ‌లితాల‌ను అంచ‌నా వేశాయి. బీహార్‌లో జేడీయూ-బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారథ్యం వహిస్తోన్న లోక్‌ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీఏకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. కానీ తాజా స‌ర్వేలు ఇందుకు వ్య‌తిరేకంగా రావ‌డం బిహార్ అంత‌టా ఉత్కంఠ‌ను రేపాయి.

చివ‌రి వారంలో…

ప్ర‌చారం తొలి నాళ్ల‌లో జేడీయూ స‌భ‌ల‌కు అధిక సంఖ్య‌లో జ‌నం వ‌చ్చేవారు. తేజ‌స్వీ స‌భ‌ల‌కు అంత ఆద‌ర‌ణ ఉండేది కాదు. మోడీ హాజ‌రైన స‌భ‌లైతే ఫుల్ స‌క్సెస్ అయ్యాయి. దీంతో జేడీయూ విజ‌యంపై ధీమా పెరిగింది. కొంద‌రు అభ్య‌ర్థులకు అతి విశ్వాసం పెరిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌చారం మొద‌టి వారంలో లాలూ ప్రసాద్​ యాదవ్​ కొడుకు తేజస్వీ యాదవ్.. సభలు అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. దీంతో తేజ‌స్వీ దూకుడు పెంచారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడి పెంచారు. నితీశ్ కు ఇవే చివ‌రి ఎన్నిక‌లు అంటూ వ్యూహాత్మ‌క ప్ర‌చారానికి తెర లేపారు. దీనికితోడు చివ‌రి వారంలో తేజ‌స్వీ స‌భ‌ల‌కు కూడా జనం పోటెత్త‌డం మొద‌లైంది. అలాగే లోక్​జనశక్తి నేత, దివంగత కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాశ్వాన్​ కొడుకు చిరాగ్​ పాశ్వాన్​ కూడా నితీశ్ టార్గెట్ గా విమ‌ర్శ‌లు పెంచాడు. లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ అభ్యర్థులు నితీశ్​కుమార్​ పార్టీ క్యాండిడేట్లతో 124 సీట్లలో నేరుగా తలపడ్డారు. నితీశ్​కు వ్యతిరేకంగా పడే చాలా ఓట్లను చిరాగ్​ పాశ్వాన్​ చీల్చే అవకాశం ఉంది. ఇవ‌న్నింటి నేప‌థ్యంలో ఓట‌ర్లు తేజ‌స్వీ వైపు మొగ్గుచూపారా..? ‌ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ప్పాయా..? అనేది తేలాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.