iDreamPost
android-app
ios-app

Bihar By Elections -ఉప ఎన్నిక ఫలితాలు తేడా వస్తే ప్రభుత్వం కూలుతుంది

  • Published Oct 30, 2021 | 5:19 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
Bihar By Elections -ఉప ఎన్నిక ఫలితాలు తేడా వస్తే ప్రభుత్వం కూలుతుంది

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. వీటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ బిహార్లో ఫలితాలపై కొంత చర్చ జరుగుతోంది. ఇక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీకి కేవలం నాలుగు సీట్లే ఎక్కువ కలిగి ఉంది. ఈ కూటమిలోని జెడీయూ ఎమ్మెల్యేలు ఇద్దరు మరణించడం వల్లే కుశ్వేశ్వర్ స్ధాన్, తారాపూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండింటినీ జేడీయూ గెలిస్తే ఆ కూటమి బలంలో మార్పు ఉండదు. కానీ ఓడిపోతే ప్రతిపక్ష కూటమి అయిన మహాఘట్ బంధన్ బలం పెరిగి సాధారణ మెజారిటీ మ్యాజిక్ సంఖ్యకు మరింత చేరువ అవుతుంది. దీన్ని అవకాశంగా తీసుకొని బలాబాలాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుత బలాలు ఇలా..

2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాఘట్ బంధన్ కూటమి మొత్తంగా 110 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఐదు సీట్లున్న ఎంఐఎం వారి వైపే ఉంది. దాంతో కూటమి బలం 115.

243 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 122 సీట్లు అవసరం. మరోవైపు నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 126 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అంటే సాధారణ మెజారిటీ మీద నాలుగు సీట్లే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇందులో జేడీయూకు చెందిన కుశ్వేశ్వర్ స్ధాన్, తారాపూర్ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో ప్రస్తుత ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ రెండింటినీ మళ్లీ జేడీయూ కైవసం చేసుకున్నా ఎన్డీఏ ఆధిక్యతలో మార్పేమీ ఉండదు. అదే ఆర్జేడీ గానీ కాంగ్రెస్ గానీ గెలిస్తే ప్రతిపక్ష కూటమి బలం 117కు పెరుగుతుంది. అంటే సాధారణ మెజారిటీకి మరో ఐదు సీట్లు తక్కువ అవుతాయి. అదే సమయంలో ఎన్డీఏ కూటమి బలం 124కు తగ్గుతుంది. మాములుగా చూస్తే ఈ అంకెలు ప్రభుత్వాన్ని దించే స్థాయిలో కనిపించవు. కానీ నిశితంగా గమనిస్తే రాజకీయ అస్థిరతకు ఆస్కారం ఉందనిపిస్తోంది.

ఆ రెండు పార్టీలపైనే దృష్టి

ఉప ఎన్నికల్లో జేడీయూ ఓడిపోయి.. ఆర్జేడీ లేదా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అధికార, ప్రతిపక్ష కూటముల బలం 122.. 117 కు చేరుకుంటే అప్పుడు రెండు పార్టీల పాత్ర కీలకం అవుతుంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి హిందూస్థాన్ అవామి మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఈ పార్టీలకు చెరో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రెండు పార్టీలు పాలకపక్షాలకు మద్దతు విషయంలో ఎప్పుడూ స్థిరంగా ఉండవని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో జేడీయూ ఓడి మహాఘట్ బంధన్ బలం పెరిగితే కచ్చితంగా ఆ కూటమి నేతలు ఈ రెండు పార్టీలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందులోనూ ఇటువంటి రాజకీయాల్లో ఆరితేరిన లాలుప్రసాద్ యాదవ్ మళ్లీ క్రియాశీలం అయిన పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవడానికి అటువంటి ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. అవి ఫలిస్తే నితీష్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ముప్పు తప్పకపోవచ్చు. కానీ ఇవన్నీ ఇప్పటికిప్పుడే జరుగుతాయని చెప్పలేం.

Also Read : Mamata Goa TMC -ఆపరేషన్ గోవాకు మమత శ్రీకారం.మూడు రోజులు అక్కడే మకాం.